
హైదరాబాద్, ప్రతినిధి : కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లును ఏపీ అసెంబ్లీ సోమవారం రాత్రి మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లులో లోపాలున్నాయనీ, రైతులకు న్యాయం జరగదంటూ వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేస్తూ, అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ ప్రవేశపెట్టిన బిల్లుకు సుదీర్ఘ చర్చ తర్వాత ఎటువంటి సవరణలు లేకుండానే శాసనసభ ఆమోదించింది. అంతకుముందు సీఆర్డీఏ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం చంద్రబాబునాయుడు సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి రాష్ర్టంలోని ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భావితరాలకు ఉపయోగపడే ఈ క్యాపిటల్‌ను, 22వ శతాబ్దపు రాజధానిగా నిర్మించుకోవాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తేనే, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అసెంబ్లీలో వివరించారు. ఐతే, ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రైతుల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. చట్టం పరిధిలోకి రాని ఈ భూసేకరణ విధానం కోర్టుల్లో నిలవదన్నారు. మాస్టర్ ప్లాన్ గీసి, రోడ్లకు సరిపడిన భూమిని సేకరిస్తే సరిపోతుందని జగన్ సూచించారు. చివరకు మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోదం తెలిపింది.