ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ ఘాటు లేఖ

హైదరాబాద్, ప్రతినిధి : గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వానికి ఘాటుగా ఓ లేఖ రాశారు. ఇప్పటివరకు అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న చర్యలు, అందుకు అయిన ఖర్చు వంటి వివరాలన్ని పొందుపరుస్తూ ఓ పూర్తి నివేదికని పంపాల్సిందిగా గవర్నర్ ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై కూడా నెలవారీగా అన్ని శాఖలు, విభాగాల పనితీరుకి సంబంధించిన నివేదికని ప్రతీ నెలా 5వ తేదీలోగా తనకి సమర్పించాల్సిందిగా గవర్నర్ ఈ లేఖలో ఆదేశించారు. దాదాపు 23 శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఈ ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, జలయజ్ఞం.. ఇలా అనేక విభాగాలు, పథకాల్లో అక్రమాలు చోటుచేసుకోవడం.. అవి కేసుల రూపంలో కోర్టుల్లో సైతం నానుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై అటువంటి అవకతవకలకి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలన కొనసాగించేందుకు వీలుగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకవేళ ఏవైనా పథకాలు, విభాగాలు, శాఖల్లో అవకతవకలకు సంబంధించి భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటితో తనకెటువంటి సంబంధం లేదని తాను నిరూపించుకునే ఛాన్స్ వుంటుందనే ఉద్దేశంతోనే గవర్నర్ ఈ నివేదికలు కోరి వుండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.