
హైదరాబాద్, ప్రతినిధి :దేశంలో ఎన్నడూ లేనంతా కష్టకాలాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కోంటుంది. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షహోదాకు సైతం దూరమైంది. ఈ షాక్తో అంతర్మథనంలో ఉన్న అధిష్టాన పెద్దలు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులువేస్తున్నారు. పార్టీకి నవరక్తాన్ని ఎక్కిస్తేనే భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. దీంతో టీ-కాంగ్రెస్ నేతల చూపులు హస్తిన వైపు వీస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినా…
ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినా తెలంగాణలో అధికారానికి కాంగ్రెస్ దూరమైంది. ఇప్పుడిక కనుచూపు మేరలో పవర్ వచ్చే ఛాన్స్ లేదు. మరోవైపు ఇప్పట్లో టీఆర్ఎస్కు బ్రేకులు వేసి కుర్చీని దక్కించుకునే అవకాశము కనిపించడం లేదు. దీంతో పార్టీలోని చాలామంది నేతలు… ఇప్పుడు ఏఐసీసీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎలాగోలా ఏఐసీసీలో చోటు దక్కించుకుంటే… భవిష్యత్లో పార్టీలో చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారు.
సీడబ్ల్యుసీ లో స్థానం దక్కించుకునేందుకు….
సీడబ్ల్యుసీ లో స్థానం దక్కించుకునేందుకు కొందరు సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ సహా టీ-పీసీసీ చీఫ్ పొన్నాల సైతం ఢిల్లీ నేతలతో టచ్లో ఉంటున్నారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, అధికార ప్రతినిధి పోస్టులపై కూడా చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆ జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, సర్వే సత్యనారాయణ సహా మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సురేశ్ రెడ్డి, షబ్బీర్ అలీ రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఎఐసీసీ కార్యదర్శులుగా ఉన్న…వీహెచ్, చిన్నారెడ్డి రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ… వారిద్దరికీ షాక్ తప్పదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పట్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఢిల్లీ పదవులను దక్కించుకుంటే అధిష్టానానికి దగ్గరగా ఉండవచ్చు. భవిష్యత్లో చక్రతిప్పవచ్చని నేతలు ఆశపడుతున్నారు. మరి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో చూడాలి.