Breaking News

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సవరణపై సమావేశం: కడియం

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సవరణపై సమావేశం: కడియం

హైదరాబాద్: రాజకీయాలకతీతంగా దళితులు, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రెండు కమిటీల సభ్యులను కోరారు. వన్ ఆఫ్ 2013 చట్టం పేరు మార్చడమే కాకుండా చాప్టర్లు, క్లాజులు చాలా మార్పులు చేయాల్సిన నేపథ్యంలో కొత్త చట్టమే చేస్తే బాగుంటుదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చట్టంపై లోతైన చర్చ అవసరమని కమిటీలు నిర్ణయించాయి.
జాతీయ బడ్జెట్ లో ప్లాన్, నాన్ ప్లాన్ పద్దుల ప్రకారం కాకుండా రెవెన్యూ, క్యాపిటల్ రూపంలో బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో సబ్ ప్లాన్ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలో ఈ ప్రయత్నం చేస్తున్న తొలి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణదేనని, దీనికోసం సభ్యులంతా మంచి సలహాలు, సూచనలివ్వాలన్నారు. సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీల మూడో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అధ్యక్షులుగా, విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉపాధ్యక్షులుగా హాజరయ్యారు. సమావేశానికి అధికార పార్టీ నుంచి ఎంపీలు గోడం నగేశ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సంజీవరావు, రెడ్యానాయక్, నల్లాల ఓదేలు, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గాదరీ కిషోర్, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గీతారెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ లు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు రాములు నాయక్, ప్రభాకర్ లు సమావేశంలో పాల్గొని వారి సలహాలు కమిటీకి తెలిపారు.
గత రెండు సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఒన్ ఆఫ్ 2013 చట్ట సవరణపై జరిగిన చర్చకు కొనసాగింపుగా వివిధ అంశాలపై మరింత లోతుగా శుక్రవారం నాడు ఎస్సీ, ఎస్టీ కమిటీలు చర్చించాయి. ప్రధానంగా చట్టంలో చాలా సవరణలు చేయాల్సి ఉందని మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసే అంశాలన్నింటిని వీలైనంత వరకు చట్టంలోనే పొందుపర్చే ప్రయత్నం చేయాలన్నారు. అభ్యంతరకరమైన అంశాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ కు సంబంధించిన చట్ట సవరణపై గురువారం దళిత, గిరిజన మేథావులతో దళిత్ స్టడీ సెంటర్, మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా నిర్వహించిన సమావేశంలో అనేక సలహాలు సూచనలు వచ్చాయి. వాటిని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పేరును ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ గా మార్చాలని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి కావాలంటే వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తే సరిపోదని, అదనపు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరపడం వల్ల వారి అభివృద్ధి ఆశించిన మేరకు జరగకపోవచ్చని, అదనపు కేటాయింపులతోనే సమాజంలో అందిరితో సమాన అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఇక గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే మురిగిపోయేవని, ఈసారి అలా కాకుండా వచ్చే సంవత్సరానికి బదలాయించే విధంగా ప్రతిపాదనలు చేసినట్లు మరోసారి ఈ సమావేశంలో చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల నిధులను ఖర్చుచేయడంలో అధికారులను బాధ్యులు చేసే విధంగా, పనిచేసే వారికి ప్రోత్సహకాలు, చేయనివారిపై చర్యలు ఉండాలన్న ప్రతిపాదనను సభ్యులంతా అంగీకరించారు.
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేయాలన్నారు. ఖర్చు కాని నిధులను వచ్చే సంవత్సరం బదిలీ చేయడమే కాకుండా ఆ సంవత్సరం కూడా ఖర్చు చేయలేకపోతే ఇంకో సంవత్సరానికి కూడా బదిలీ చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలన్నారు. మొత్తానికి ఎస్సీ, ఎస్టీల నిధులు మురిగిపోకుండా ఈ చట్టంలో పటిష్టమైన ప్రతిపాదనలుండాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించే నిధులన్నీ ఒకే దగ్గర సమీకరించి ఖర్చు చేసే విధంగా ఉండాలన్నారు. వచ్చే సమావేశం తేదీలను సభ్యులకు తెలియజేస్తామని, ఆలోపు చట్ట సవరణపై సభ్యులు మరిన్ని ప్రతిపాదనలు రూపొందించుకుని రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *