
ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తాజా మాజీ ఎమ్మెల్యే, పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్ తండా, పెద్ద తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఘనమైన అభివృద్ధి సాధించామన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందినకాడికి దోచుకున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధితో సీఎం కేసీఆర్ కు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, అది చూసి ఓర్వ లేక ప్రతి పక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయని అన్నారు. వారికి బుద్ధి చెప్పడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. రోడ్లు, విద్యుత్ దీపాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచామన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర్ర ప్రజలు ప్రశంసించారని, ఆయన పాలనపై నమ్మకంతోనే టీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభించిందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో అనేక మంది లబ్ధిపొందుతున్నారన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణ పథకాలు ప్రతీ ఇంటికి చేరాయన్నారు. ఈ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ నే మళ్లీ గెలిపించుకోవాలన్నారు. అంతకుముందు మహిళలు మంగళహారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. జీసీసీ చైర్ పర్సన్ గాంధీనాయక్, స్థానిక నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.