
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ భారతీయ జనతా పార్టీపై మాటలదాడిని క్రమక్రమంగా పెంచుతున్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ భయపడుతోందని కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతికి పంపిన లేఖను గవర్నర్ సమీక్షించాలని, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సరికాదని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. స్టింగ్ సిడీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపి.. గవర్నర్ జంగ్ సూచనను తిరస్కరించాలని కోరనున్నట్లు తెలిపారు. ఆప్ ఇలాంటి మరిన్ని అసంబంధ వ్యవహారాలను లేవదీయనుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉండటమే గాక, ఢిల్లీలో ఏడు ఎంపి స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు భయపడుతుందో తెలియడం లేదని కేజ్రివాల్ అన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన నిర్వహిస్తామని చెప్పిన ఆయన, స్టింగ్ ఆపరేషన్ ద్వారా వారి ద్వంద్వ విధానాలను ఎండగడతామని తెలిపారు. తాము మళ్లీ ఎన్నికలు జరుగాలని కోరుకుంటున్నామని.. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు