ఎట్టకేలకు ఐఏఎస్ అధికారుల విబజన

న్యూఢిల్లీ, ప్రతినిధి : ‘తమ రాష్ట్రాల్లో పాలన కుంటుపడుతోంది. వెంటనే అధికారులను విభజించండి’ అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రాన్ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. కానీ అధికారుల విభజన ఆలస్యమైంది. చివరకు ఎనిమిది నెలల సుదీర్ఘ కసరత్తు అనంతరం అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) అధికారుల విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్..తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాపై ప్రధాని నరేంద్రమోడీ ఆమోదముద్ర వేశారు. జాబితాలో ప్రకటించిన వారందరూ జనవరి 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలని డీవోపీటీ ఆదేశించింది. అయితే రెండు రాష్ట్రాలకు కేటాయింపుల్లో మళ్లీ మార్పులు చేర్పులు ఉండడంతో తుది కేటాయింపులకు మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది.

వెంటనే పోస్టుల్లో చేరాలి..
రెండు రాష్ట్రాల సీఎస్‌లు ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఆ వెంటనే అధికారులు ఆయా పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జాబితా ప్రకారం జూన్ 1వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మంది ఐఏఎస్ అధికారుల్లో తెలంగాణకు 128 మందిని, ఆంధ్రప్రదేశ్‌కు 166 మందిని కేటాయించారు. ఇక 211 మంది ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకు 92 మందిని, ఆంధ్రప్రదేశ్‌కు 119 మందిని ఇచ్చారు. జాబితా ప్రకారం తెలంగాణకు ఆరుగురు డీజీపీ స్థాయి,13 మంది అదనపు డీజీపీ స్థాయి అధికారులు వచ్చారు. ఇక ఐఎఫ్‌ఎస్ అధికారుల విషయానికి వస్తే 127 మంది అధికారుల్లో తెలంగాణకు 51 మంది, ఏపీకి 76 మంది దక్కారు.

పలు సూచనలు..
డీవోపీటీ ప్రకటించిన ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రుడు, వేణుగోపాలచారి తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించి 45 రోజుల్లోగా కమిటీ పరిష్కరిస్తుంది. ఇలా మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తిచేశారు. పరస్పర మార్పిడి, భార్యాభర్తలు, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారు సమర్పించే అభ్యంతరాలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు వివిధ కారణాల వల్ల వారు కోరిన చోట పనిచేయడానికి కేంద్రం అనుమతించింది. వీరి కేటాయింపులను తుది నిర్ణయం తీసుకునేంతవరకు వీరిలో ఒకరైన జేఎస్వీ ప్రసాద్‌ ఆంధ్రాలో 2నెలల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి వి నాగిరెడ్డి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్‌ మీనా తదితరులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకే కేటాయించింది.

అటూ ఇటూ మారిన అధికారులు..
ఒకే కేడర్, ఒకే గ్రేడ్ పే ఉన్న మరో అధికారితో పరస్పర మార్పిడి కూడా చేసుకోవచ్చని డీవోపీటీ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన రోజు నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న వారు నచ్చిన రాష్ట్రానికి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10లోగా ప్రత్యూష్‌సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలను ఒకే రాష్ట్రానికి కేటాయించేందుకు వీలులేని పక్షంలో తర్వాత ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారు కూడా కేడర్ కేటాయింపు కోసం దరఖాస్తు చేయోచ్చు. కేంద్రం విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం పలువురు ఐఏఎస్‌లు ఇరు రాష్ట్రాల మధ్య అటూఇటు మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 50 మంది మారుతుండగా..తెలంగాణ నుంచి ఆంధప్రదేశ్‌కి 30 మంది అధికారులు వెళ్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.