ఎట్టకేలకు ఉద్యోగులను విభజించారు

హైదరాబాద్, ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీస్‌ అధికారుల కేటాయింపునకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల తాత్కాలిక కేటాయింపులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదముద్ర వేశారు. ప్రత్యూష సిన్హా కమిటీ చేసిన తుది సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనుంది. తర్వాత వారం రోజుల్లోగా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపులపై ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలియచేయాలని, అలాగే పరస్పర మార్పిడి, భార్యాభర్తల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తులనూ పరిశీలించనున్నారు. మూడు నెలల్లోగా తుది జాబితాను ప్రధాని ఆమోదంతో కేంద్రం ప్రకటించనున్నట్లు సమాచారం.

ఏపీకి 166..తెలంగాణకు 128 ఐఏఎస్ లు..
జూన్ ఒకటో తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మంది ఐఏఎస్ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 166 మందిని, తెలంగాణకు 128 మందిని కేటాయించారు. అలాగే 211 మంది ఐపీఎస్‌ల్లో ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది, ఇక 127 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో ఏపీకి 76 మంది, తెలంగాణకు 51 మందిని కేటాయించారు. ఈ అధికారుల విభజన కోసం గత మార్చి 28న ప్రత్యూష సిన్హా కమిటీని కేంద్రం నియమించింది. అధికారుల ఆప్షన్‌లను తీసుకున్న కమిటీ రోస్టర్ విధానాన్ని అనుసరించి తొలి జాబితాను ఆగస్టు 22న ప్రకటించింది. అయితే 70 మంది అధికారులు తమ అభ్యంతరాలను కమిటీకి అందించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను అక్టోబర్ 10న ప్రత్యూష సిన్హా కమిటీ వెల్లడించగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రధాని కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైలు వెనక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మరో రెండు సార్లు కమిటీ సమావేశమై కేటాయింపులను ఖరారు చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారులను ఇన్‌సైడర్లుగా పరిగణించి వారు చదువుకున్న ప్రాంతం, సర్వీస్‌లో చేరడానికి ముందు వారిచ్చిన పోస్టల్ అడ్రస్‌ల ఆధారంగా పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించింది. రాష్ట్రేతర అధికారులను రోస్టర్ విధానంలో విభజించింది. దీంతో ఎట్టకేలకు రూపొందిన తుది తాత్కాలిక జాబితాకు ప్రధాని ఆమోదం లభిం చింది. దీనిపై 15 రోజుల్లోగా వచ్చే అభ్యంతరాలన్నింటినీ మూడు నెలల్లో పరిష్కరించి తుది జాబితాను కేంద్రం విడుదల చేయనుంది.

తెలంగాణకు అజయ్ జైన్..
తాత్కాలిక కేటాయింపులో భాగంగా తెలంగాణ కేడర్‌లో వచ్చిన డాక్టర్‌ పీవీ రమేశ్‌ను ఆంధ్రాకు, అలాగే ఏపీ కేడర్‌లో ఉన్న నీలం సహానీ, ఆమె భర్త అజయ్‌ సహానీ వేరువేరు రాష్ట్రాలకు వెళ్లనున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్‌ జైన్‌ను తెలంగాణకు కేటాయించారు. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలినీ మిశ్రాను ఆంధ్రాకు కేటాయించారు. వీరు తెలంగాణ కావాలని కోరుకున్నారు. బదలాయింపుల్లో వీరు  తెలంగాణకు రావాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.