
పెద్దల సభలో అడుగుపెట్టడానికి పెద్ద యుద్ధమే జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి సీటు కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకుడు దేవీ ప్రసాద్ టీఆరెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున మరోసారి న్యాయవాది రామచంద్ర రావు పోటీ పడుతున్నారు.
ఉద్యోగ సంఘం, జేఏసీ తరఫున తెలంగాణ ఉద్యమంలో దేవీప్రసాద్ చురుగ్గా పాల్గొన్నారు. ఆ గుర్తింపు ఆయనకు అతి పెద్ద బలం. పైగా, అధికార పార్టీ కొండంత అండగా నిలిచి బరిలోకి దింపడంతో ఆయన పూర్తి ఆత్మ విశ్వాసంతో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం నిరంతర పోరాటం చేసిన వ్యక్తినే ఎన్నుకోవాలనేది టీఆరెస్ నినాదం.
గ్రాడ్యుయేట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కేడర్ సహాయంతో ప్రచారం చేస్తున్నారు. టీఆరెస్ కేడర్ ఆయనకు పూర్తిగా సహకరిస్తోంది. రాజకీయాలకు కొత్తయినా, ఉద్యోగుల నేతగా, ఉద్యమకారుడిగా ఉన్న ఇమేజ్ కలిసి వస్తుందని టీఆరెస్ నమ్మకంతో ఉంది.
బీజేపీ నాయకుడు రామచంద్ర రావు ఈసారైనా ఈ సీటును గెల్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. క్రితం సారి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయానని, ఇప్పుడు గ్రాడ్యుయేట్ల మద్దతు తనకే ఉందని ఆయన ధీమాగా ఉన్నారు. ఇటీవల మల్కాజ్ గిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఇక్కడా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ సానుభూతితో ఓటర్లు ఈసారి ఆయన్ని గెలిపిస్తారని కమలనాథులు ఆశిస్తున్నారు.
టీడీపీ మద్దతు కూడా ఉండటంతో అది మరింత ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. సీమాంధ్రుల ఓట్లన్నీ తనకే అనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. అదే జరిగితే ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు బీజేపీ కార్యకర్తలు. చివరకు సీమాంధ్రుల నిర్ణాయక ఓట్లు ఎటు వైపు పడతాయనేది ఆసక్తికరంగా మారింది.