
2017-18 విద్యాసంవత్సరానికి ఎంసెట్, నీట్, ఐ.ఐ.టి.మేయిన్స్పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ప్రసారాలు ఈ నెల 20వ తేది నుండి మళ్ళీ ప్రసారం చేయనున్నామని మనటివి సి.ఇ.ఓ ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా నిలిపివేసిన ప్రసారాలను మళ్ళీకొనసాగిస్తున్నామని సిఇ.ఓ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఎంసెట్, నీట్, ఐ.ఐ.టి.మేయిన్స్ విద్యార్థుల కోసం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మూడు గంటల పాటు, సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరో మూడు గంటల పాటు ఈ ప్రసారాలు కొనసాగనున్నాయన్నారు. మే 12న ఎంసెట్ పరీక్ష ఉన్నందున 11వ తేది వరకు ప్రసారాలు కొనసాగుతాయని, 63 రోజులు సుమారు 378 గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని సి.ఈ.ఓ వెల్లడించారు.గతంలో ప్రసారం చేసిన ప్రసారాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి విశేష ఆదరణ లభించిందన్నారు. ఆదివారం, సెలవ్ రోజుల్లో గత వారం ప్రసారాలను పున: ప్రసారం చేయనున్నామని స్పష్టం చేసారు.మనటివి-1, మనటివి-2 చానళ్ళలో శిక్షణ కార్యక్రమాలు ప్రసారమౌతాయని, చానళ్లతో పాటు మనటివి సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారాలు ఉంటాయని తెలిపారు.విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని శైలేష్ రెడ్డి కోరారు.