
హైదరాబాద్, ప్రతినిధి : ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం సీరియస్ అయ్యింది. శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని.. మంత్రి దేవినేని ఉమపై పలు ఆరోపణలు..విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపట్ల టిడిపి పెద్దలు అలర్ట్ అయ్యింది. ఏదైనా సమస్య ఉంటే అంతర్గత సమావేశంలో చర్చించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు ఎలా అభివృద్ధి కాలేదని విమర్శిస్తారని ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వెంటనే హైదరాబాద్ కు వచ్చి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వివరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనితో బాబుకు కేశినేని ఎలాంటి వివరణ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. నాని ఇచ్చే వివరణతో బాబు సంతృప్తి చెందకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టిడిపిలోని కొంతమంది సూచిస్తున్నట్లు సమాచారం.
అప్రమత్తమైన టిడిపి..
ఇటీవల డిప్యూటి సీఎం కేఈ..ఏకంగా చంద్రబాబు నాయుడిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సంస్కృతి ఎక్కువైందని భావిస్తున్న టిడిపి దీనికి ఎలా చెక్ పెట్టాలని భావిస్తున్న తరుణంలో ఎంపీ కేశినేని వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. దీనితో టిడిపి అధిష్టానం అప్రమత్తమైంది. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై టిడిపి అధిష్టానం, బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
దేవినేని ఏమన్నారు ?
ఆరునెలల్లో బెజవాడకు ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఇక విజయవాడ పోలీస్ కమిషనర్ తీరు వివాదాస్పదంగా ఉందని నాని ఆరోపించారు. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరుతో కాశ్మీర్లో కూడా లేని విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. అధికారులు దేవినేని ఉమను మాత్రమే సంపద్రిస్తున్నారని, మిగతా ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్నారని విమర్శించారు. కేశినేని వివాదాస్పద వ్యాఖ్యలతో బెజవాడ టిడిపిలోని అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.