
సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం క్రింద ఎంపీలు ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాలలో చేపడుతున్న పనులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఈ పథకంపై సి.ఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఆర్ మీనా, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ పార్ధసారధి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి శ్రీ జగధీశ్వర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ బెనహర్ మహేష్ దత్ ఎక్కా, పంచాయతీ రాజ్ కమీషనర్ శ్రీమతి నీతూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీలు ఎంపికచేసిన గ్రామాలలో పనులను జిల్లాలో పనిచేసే సీనియర్ అధికారులు సమీక్షించేలా చూడాలని, ప్రజలను భాగస్వామ్యులు చేయాలని సి.ఎస్ అన్నారు.
ఆదర్శ గ్రామాలలో చేపడుతున్న పనుల వివరాలను శాఖల వారిగా తయారుచేసి సంబంధిత శాఖల అధికారులకు ఇవ్వాలని సి.ఎస్ కోరారు. మొదటి ఫేజ్ లో ఎంపిక చేసిన 22 గ్రామాలలో 1094 ప్రాజెక్టులు మంజూరు చేశారని, ఇందులో 431 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 216 పురోగతిలో ఉన్నాయని, 447 ప్రారంభం కావలసి ఉందన్నారు. పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని, పూర్తయిన పనులను పరిశీలించడంతో పాటు, వాటి ప్రభావాన్ని అంచనా వేయాలన్నారు. ఏమయినా గ్యాప్ ఉంటే వాటిని సరిచేయాలన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన రెండవ,మూడవ విడత గ్రామాల ఎంపికకు సంబంధించి పార్లమెంటు సభ్యులకు లేఖలు వ్రాయాలని సి.ఎస్ అన్నారు. ఆదర్శ్ గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడేలా, తగు సిబ్బందిని కేటాయించాలని, ఆస్తులను కాపాడాలని సి.ఎస్ అన్నారు.ఆదర్శ గ్రామాల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను, SHG గ్రూపు సభ్యులను, ప్రముఖులను గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యులు చేయాలన్నారు. రెండవ, మూడవ దశల్లో ఎంపికయ్యే గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని సి.ఎస్ కోరారు.