
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): సింగరేణి కాలరీస్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని టీ టిడిపి అధికార ప్రతినిధులు రాజారాం యాదవ్, పాల్వాయి రజనీ కుమారి విమర్శించారు. వేముల జయశ్రీతో కలిసి ఎన్టీఆర్ భవన్లో విలేఖరుల సమావేశంలో మాట్టాడుతూ సింగరేణి కార్మిక సంఘాల అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షలకు విక్రయించి నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. ఈ నియామకాల్లో జరిగిన అక్రమాలకు కవితమ్మకు ఎలాంటి సంబంధం లేకుంటే ఈ అక్రమాలపై సీబీసీఐడి, ఏసీబీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాత పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించి ప్రతిభ గల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పేరిట రాజకీయం చేసి కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని వేముల జయ శ్రీ అన్నారు.