ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలను ఘనమైన ఏర్పాట్లు : కడియం శ్రీహరి

 

  • ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలను పండగలా నిర్వహించుకోవాలి
  • ఉస్మానియా శతాబ్ది పండగకు అందరూ సహకరించాలి
  • యూనివర్శిటీలలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది
  • త్వరలో యూనివర్శిటీలలోని ఖాళీల భర్తీ జరగనుంది
  • తెలంగాణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అవినాభావ సంబంధం ఉంది
  • ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

 

హైదరాబాద్ 20 – ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఈ నెల 26, 27, 28 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ మూడు రోజుల్లో ప్రారంభ వేడుకలు జరుగుతాయని, ఆ తర్వాత ఏడాది పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత పురాతన యూనివర్శిటీల్లో ఏడోవదని, దక్షిణ భారతదేశంలో మూడోదని, ఈ యూనివర్శిటీ మేథావులు, రాజకీయ నాయకులు, అనేక మంది గొప్పవాళ్లను తన ఒడిలో చదువులు నేర్పి ప్రపంచానికి అందించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని యాస, భాష, సంప్రదాయాలతో ఉస్మానియాకు ప్రత్యేక అనుబంధముందున్నారు. తెలంగాణ జీవితాలతో ముడిపడి ఉన్న ఉస్మానియా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోనే 200 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఈ బడ్జెట్ తో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కాలేజీల్లో కూడా హాస్టళ్ల కొత్త భవనాలు, మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్త సెంటినరీ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, మౌలిక వసతులు రానున్నాయని చెప్పారు. ఈ కొత్త నిర్మాణాలకు ఈ నెల 26వ తేదీన గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 26వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల ప్రారంభ వేడుకలకు గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని చెప్పారు. 27వ తేదీన జరిగే అలుమ్ని మీటింగ్ కు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారని తెలిపారు. 28వ తేదీన జరిగే అలిండియా వీసీల సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిధిగా వస్తున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రారంభ వేడుకలలోని సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ వేతనాల పెంపు, మెస్ ఛార్జీల బకాయిల రద్దు, ఛార్జీల పెంపు వంటి అనేక సమస్యలుంటే…వాటిని ప్రభుత్వం తీర్చుతుందన్నారు. ఇప్పటికే బకాయిలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ రద్దు చేశారని, దాదాపు వంద శాతం వరకు మెస్ ఛార్జీలను పెంచారని తెలిపారు. గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి మాజీ వీసీ తిరుపతిరావు ఆధ్వర్యంలో కమిటీ వేశారని, త్వరలోనే వారి నివేదిక మేరకు పెంపు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ వేడుకలను పండగలా జరుపుకునేందుకు పాత, కొత్త విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రజలంతా సహకరించాలని, మన యూనివర్శిటీ పేరు, ప్రతిష్టలు మరింత ఇనుమడించే విధంగా తోడ్పాటు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు.

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎంపీ కేశవరావు, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఓఎస్ డీ లింబాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *