ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి…ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కలెక్టర్లు సొంత ఎజెండాలతో పనిచెయ్యొద్దు…ప్రభుత్వ ఎజెండాలే వారి ఎజెండాగా ఉండాలి

మిషన్ భగీరథ కింద ఈ ఏడాది ఏప్రిల్ 15లోపు ఆవాసాలన్నింటికి బల్క్ నీటి సరఫరా పూర్తి కావాలి

జూన్ 31లోపు జనగామ, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వాలి

జూలై 31లోపు వరంగల్ కార్పోరేషన్, భూపాలపల్లి జిల్లాల్లో ఇంటింటికి నల్లా నీళ్ల పంపిణీ పూర్తి చేయాలి

వేసవిలో ఏ ఒక్క గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి..వారానికొక రోజు మిషన్ భగీరథను సమీక్షించాలి

ఈ ఏడాది జూలై 31లోపు మిషన్ కాకతీయ 1,2,3,4 మరమ్మత్తులు పూర్తిచేయాలి

మిషన్ కాకతీయలో ఆశించినట్లు పనిచేయని అధికారులను సరెండర్ చెయ్యండి

మిషన్ కాకతీయ మినిష్టర్ హరీష్ రావు అద్భుతంగా టెక్నాలజీ వాడుకుంటూ పనిచేస్తున్న మినిష్టర్

స్థలాలను కొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలి…స్థలాల కోసం ఇంకా ఎదురు చూడొద్దు

ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న చోటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రగతి బాగుంది…అధికారులు పట్టించుకోవాలి

హరితహారంలో బ్లాక్ ప్లాంటేషన్ ను బాగా ప్రోత్సహించాలి…నర్సరీల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి…హరితహారంలో పెట్టిన చెట్లను ఎండాకాలంలో సంరక్షించాలి…

ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం. వరంగల్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం అమలు తీరుపై మంత్రి చందూలాల్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి నందన గార్డెన్స్ లో నేడు సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం పథకాలను దేశం మొత్తం ప్రశంసిస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ పనులలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీలోపు అన్నిజనావాసాలకు బల్క్ నీటి సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 31లోపు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు ఇంటింటికి నీరు అందించే విధంగా ఇంట్రా పైప్ లైన్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. జూలై 31వ తేదీలోపు భూపాలపల్లి, వరంగల్ కార్పోరేషన్ పరిధిలో ఇంట్రాపైప్ లైనులు పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందించాలన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉందని, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పర్యవేక్షణలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ పనుల్లో నిధులకు సంబంధించి ఇబ్బంది లేదని, బిల్లులు సకాలంలో వస్తాయన్నారు. ట్రయల్ రన్ చేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాత మళ్ళీ ఆ సమస్య వస్తే అది కాంట్రాక్టర్ల వైఫల్యంగా గుర్తిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అందరి కంటే ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తి కావాలని కోరారు. మిషన్ భగీరథ పనులు మనకు అత్యంత ప్రాధాన్యమని, ఇంతకు మించి వేరే ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. వారంలో ఒక రోజు మిషన్ భగీరథ పనులకు కేటాయించాలన్నారు. మళ్ళీ 15 ఏప్రిల్ కు సమీక్ష చేస్తానని , ఈలోపు జరిగిన ప్రగతి కనపడాలన్నారు. ఈ నాలుగు వారాలు కష్టపడి పని చేయాలని సూచించారు. ఇక వేసవిలో ఏ ఒక్క గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ప్రత్యేకంగా విజ్ణప్తి చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో మార్చి 31లోపు పరకాలలోని అన్ని ఇళ్లకు నల్లా నీటిని అందిస్తామని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత హామీ ఇచ్చారు. ఈ నెలాఖరుకు కనుక నీరిస్తే చాలా మంచి పేరు వస్తదని, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను గొప్పగా సన్మానిస్తామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. భూపాలపల్లి లో ఏప్రిల్ 15లోపు ప్రతి గ్రామానికి బల్క్ వాటర్ సప్లై చేసేలా ప్లాన్ చేస్తున్నామని కలెక్టర్ అమెయ్ కుమార్ తెలిపారు.

మిషన్ కాకతీయ పనుల్లో ఆలస్యం చేస్తున్న అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేయలేకపోతే సెలవు పెట్టి వెళ్లాలని నేరుగా అధికారులను కోరారు. అలా కాని పక్షంలో పనిచేయని అధికారులను సరెండర్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో అలసత్వం వహిస్తే సహించమని, అధికారులపై తమకు ఆగ్రహంలేదని, ఇది ఆవేదన మాత్రమేనని చెప్పారు. పనులు తీరును ప్రశ్నించినప్పుడు కాకతీయ పనుల అంచనాలు రూపొందించడంలో జరుగుతున్న ఆలస్యాన్ని ఇంజనీర్లు, అధికారులు అంగీకరించారు. ఫైళ్లు పైస్థాయి నుంచి రావడం లేదని చెప్పారు. దీంతో ఇంకా ఫైళ్లు, ప్రతిపాదనలంటూ పనులు ఆలస్యం చేయడమేమిటని ఉప ముఖ్యమంత్రి కడియం అధికారులను అడిగారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని దానిని వినియోగించుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఉంటూనే కాళేశ్వరం ప్రాజెక్టుల పనితీరును ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్న తీరు అద్భుతంగా ఉందని, మీ మినిష్టర్ అలా ఉంటే …మీరు ఇంకా టెక్నాలజీని ఎందుకు వాడుకోవడం లేదన్నారు. వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పనులు తీరును పర్యవేక్షించాలన్నారు. మిషన్ కాకతీయ 1,2,3,4 కింద చెరువుల మరమ్మత్తుల పనులు జూలై 31,2018 లోపు పూర్తి చెయ్యాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు మిషన్ కాకతీయ ఇంజనీర్ల పని తీరును సమీక్షించాలని చెప్పారు. కాకతీయ పనులు సరిగా జరగడం లేదని, ఇరిగేషన్ ఎస్.ఈ ప్రసాద్ నాయకత్వంలో వరంగల్ లో పనులు నాశనమవుతున్నాయని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎస్.ఈ శ్రీనివాస్ రెడ్డిని చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు దొరకడం లేదని చెప్పడం కాకుండా గ్రామాల్లో భూములను కొని అక్కడ వీటిని నిర్మించాలని కలెక్టర్లకు సూచించారు. ఇటీవల కమలాపూర్ నియోజక వర్గంలో కలెక్టర్ ఇలా చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చేస్తే బాగుంటుందన్నారు. హరితహారం లో భాగంగా కలెక్టర్లు ఎక్కువగా బ్లాక్ ప్లాంటేషన్ ను ప్రోత్సహించాలని ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాలయాల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఎక్కువగా చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని, అవసరమైతే ఉపాధి హామీ పథకం ద్వారా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు నర్సరీలని సందర్శించి అక్కడి పెంచుతున్న మొక్కలను పరిశీలించాలని, ప్రభుత్వం చెప్పిన మొక్కలే పెంచుతున్నారా, లేదా అని చెక్ చేయాలన్నారు. నర్సరీల్లో ఇస్తున్న మొక్కలు ప్రభుత్వం చెబుతున్న మొక్కలు వేరని గతంలో విమర్శలు వచ్చిన సంగతిని అధికారులకు గుర్తు చేశారు. ఎక్కువగా పండ్లు, పూల మొక్కలు నర్సరీల్లో పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నర్సరీలను ప్రోత్సహించాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు.

కొత్త కలెక్టర్లకు క్లాస్ చెప్పిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు జిల్లాలో నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. వీరంతా ఈ రోజు వరంగల్ లో సమీక్షా సమావేశానికి తొలిసారి హాజరయ్యారు. ఇందులో జయశంకర్ జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్, జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఉండగా.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సీపీ గౌతమ్ లను సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అందరికీ పరిచయం చేసారు. అనంతరం కలెక్టర్లకు సొంత అజెండాలు ఉండొద్దని, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండానే కలెక్టర్ల ఎజెండాగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలే కలెక్టర్ల పథకాలుగా చేసుకొని వాటిని వేగంగా పూర్తి చేసే విధంగా మీ పని తీరు ఉండాలి అని చెప్పారు. మొదటగా కలెక్టర్ పోస్టింగ్లో మీ పని బాగుంటే మీకు మంచి పేరు వస్తుందని, అదే విధంగా భవిష్యత్ లో ప్రాముఖ్యత కలిగిన పోస్టింగ్ లు వస్తాయన్నారు. ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కష్టపడి పని చేయాలని సూచించారు. ఇక్కడ ఉన్న ఇద్దరం మంత్రులం మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టమని మీకు అన్ని విధాలా అండగ ఉంటాము అని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తీయనైన తెలుగుతెలంగాణ తెలుగు ఉగాది బుక్ లెట్ ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లా పౌర సంబంధాల అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ సమీక్ష సమావేశం లో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ విప్ లు బోడెకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, దాస్యం వినయ్ భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, చల్ల ధర్మారెడ్డి, వొడితేల సతీష్ కుమార్, రాజయ్య, మిషన్ భగీరథ ఈ అండ్ సి సురేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

kadiyam srihari 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.