ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నాల్గోసారి సమావేశమైన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్)

బాలికల విద్యపై ఈ నెల 16వ తేదీన మధ్యంతర నివేదిక

జనవరి నెలాఖరుకానీ, ఫిబ్రవరిలోగానీ తుది నివేదిక ఇవ్వాలని నేటి సమావేశంలో నిర్ణయం

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నాల్గోసారి సమావేశమైన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్)

పీజీ వరకు బాలికలకు ఉచిత, నిర్భంద విద్య అందించాలనే ప్రతిపాదన

ప్రతి రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలి  తెలంగాణలో మాదిరిగా బాలికలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా గురుకుల విద్యాలయాలు నెలకొల్పాలి

కేజీబీవీలలో విద్యను 8వ తరగతి వరకు కాకుండా ఇంటర్ వరకు అందించాలి

మోడల్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యను వంద నుంచి 200కు పెంచాలి

బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి హెల్త్ కిట్స్ అందించాలి

కేబ్ సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించిన చైర్మన్ కడియం శ్రీహరి, అంగీకరించిన సభ్యులు

హైదరాబాద్, జనవరి 09 : దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత విద్యను అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్)
మీటింగ్ లో ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రతిపాదించడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది. ఈ కేబ్ గౌహతి, న్యూఢిల్లీ, భువనేశ్వర్ లలో మూడుసార్లు సమావేశమై నాల్గోసారి హైదరాబాద్ లో నేడు సమావేశం అయింది. ఈ సమావేశానికి జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరాజా యాదవ్, అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ రీనారాయ్, మెంబర్ సెక్రటరీ మీనాక్షీ గార్గ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

తెలంగాణలో విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, బాలికల విద్య కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఈ రోజు కేబ్ మీటింగ్ లో చర్చించిన అంశాలను విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత, నిర్భంద విద్య అందించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇదేవిధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మహిళా యూనివర్శిటీలను కూడా అన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీలలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకే విద్య అందిస్తున్నారని, దీనిని ఇంటర్ వరకు పొడగించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వంద వరకే ఉందని, దీనిని 200కు పెంచాలని సూచిస్తున్నామన్నారు. యుక్తవయస్సు వచ్చిన బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, వారికి ఆరోగ్య-పరిశుభ్రత కిట్స్ ఉచితంగా అందించాలని అన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయా విద్యాలయాలలో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తున్నారని, ఇలాంటివి రెసిడెన్షియల్ విధానంలో మరిన్నిఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. బాలికలకు విద్యాలయాల్లో భద్రత కల్పించాలని, ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేబ్ మీటింగ్ లో నేడు ప్రతిపాదించారు. మొత్తానికి పాఠశాలల్లో అకాడమిక్ అట్మాస్పియర్ నెలకొల్పాలని చెప్పారు. త్వరలోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తరపున అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలో అమలు చేస్తున్న పది ఉత్తమ విధానాలను సేకరించి, వాటి నుంచి 10 నుంచి 15 వరకు ఉత్తమ విధానాలను
క్రోడీకరించి తమ తుది నివేదికలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

మరొక సమావేశం ఢిల్లీలో ఈ నెల 15, 16 తేదీల్లో ఉంటుందన్నారు. అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ…కేబ్ చైర్మన్ కడియం శ్రీహరి చెప్పినట్లు తాము వెంటన మధ్యంతర నివేదిక అందిస్తామని, తుది నివేదికలో
కూలంకుషంగా బాలికల విద్యలో ఉన్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రాతిపాదిస్తామన్నారు. కచ్చితంగా కేబ్ చైర్మన్ కడియం
శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ బాలికల విద్యపై అత్యుత్తమ ప్రతిపాదనలతో నివేదిక ఇస్తుందన్నధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరాజా యాదవ్ మాట్లాడుతూ…ప్రధానమంత్రి బేటీ బచావో..బేటీ పడావో నినాదాన్ని నిజం చేసే విధంగా తమ నివేదిక ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బాలికల విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు కావల్సిన అన్ని అంశాలతో తన నివేదిక అందజేస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *