ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమావేశమైన ఎంపీ కవిత

·        మా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను పటిష్టం చేయండి

·        ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సమావేశమైన ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు

·        విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ముందుకు రావడం హర్షనీయం- ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

·        సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్ 23 – నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు చేసిన విజ్ణప్తికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారు. వెంటనే పాఠశాలలు, కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పెషల్ సీ.ఎస్ రంజీవ్ ఆర్. ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ లను ఆదేశించారు.

 నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు కొత్తవి మంజూరు కోరుతూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్,బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజీవరావు, విద్యాసాగర్ రావు రాష్ట్ర ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలోని ఆయన చాంబర్ లో సమావేశమయ్యారు. అదేవిధంగా కొన్ని పాఠశాలలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. పాత భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని అడిగారు.

            స్థానికంగా తాము నియోజక వర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఇంగ్లీషు మీడియం పాఠశాలకు అనుమతులు ఇప్పించాలనే డిమాండ్ తీవ్రంగా ఉందని ఎంపీ, ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామసభల్లో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం కు మార్చేందుకు అనుమతించాలని, వీలు కాని పక్షంలో కొత్త స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. మైనారిటీ పాఠశాలలు, కాలేజీలకు ప్రత్యేక సాయమందించాలన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుపుతున్న కాలేజీలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాటిని నడిపించాలని కోరారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి చేసి ఫలితాల్లో కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఎంపీ కవిత కోరారు.

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సానుకూలం

        నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పటిష్టత కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావడంపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించి తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు వీలైనంత వరకు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  అయితే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద కొన్ని నిధులు, ఎమ్మెల్యే ఫండ్స్ కొన్ని కలిపితే తాము ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధులు కలిపి కొత్త భవనాలు మంజూరు చేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామని వివరించారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం ప్రతి హైస్కూల్ కు ఏటా లక్ష రూపాయల గ్రాంట్ ను  ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్, ఫర్నిచర్ ఉండాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

        మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎక్కడా కూడా జాప్యం లేకుండా ఇప్పటికే నిధులు విడుదల  చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి ప్రతి పాఠశాలకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం లు, స్కూల్ గ్రాంట్లు అందించాలని ఆదేశాలిచ్చామని తెలిపారు

        పాఠశాలలో నమోదు పెంచడంలో ఎమ్మెల్యేలు కూడా తమ వంతు పాత్ర పోషించాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అప్పుడప్పుడు తనిఖీ చేసి, అక్కడ మధ్యాహ్న భోజన వసతులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయులు హాజరు, విద్యార్థుల ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

        విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం మౌలిక వసతులు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తోందని, వాటిని సరైన రీతిలో వినియోగించుకునేందుకు, నిర్వహించేందుకు మంచి విద్య ఉన్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలలో ఎన్ సీసీని తప్పనిసరి చేసే అంశాన్ని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *