ఉత్పత్తిలో కేటీపీపీ దే అగ్రస్థానం

వరంగల్ జిల్లా (ములుగు) ఘనపురం, చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కు అత్యంత ప్రాముఖ్యత లభించింది. 500 మెగావాట్ల యూనిట్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రారాజుగా వెలిగిపోతున్న కేటీపీపీ తన రికార్డులను తానే తిరగరాస్తున్నది. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు మూడు ఉండగా, వాటిల్లో కేటీపీపీతో పాటు మరొకటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 6వ దశ, ఏపీజెన్‌కో పరిధిలో వీటీపీఎస్ 4వ దశ ప్రాజెక్టులున్నాయి.

ఇంటర్ స్టేట్, ఇంట్రాస్టేట్ పవర్‌ప్రాజెక్టుల్లోనూ కేటీపీఎస్ రారాజుగా వెలుగొందుతున్నది. బ్యాక్‌డౌన్ ఉన్నప్పటికీ పీఎల్‌ఎఫ్ విషయంలో రాజీలేకుండా కేటీపీఎస్ విద్యుత్ ఇంజినీర్ల కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ, ఏపీజెన్‌కో పరిధిలోని విద్యుత్ ప్రాజెక్టులకు దీటుగా కేటీపీపీ తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది.

2005లో రూ.2,500 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) 2010లో ప్రాజెక్టు పూర్తయింది. 2010 మార్చి 30న విద్యుత్ ఉత్పత్తితో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2011-12లో 55 శాతం పీఎల్‌ఎఫ్‌తో సరిపెట్టుకున్న కేటీపీపీ 2013-14లో ఏకంగా 91.07 శాతం పీఎల్‌ఎఫ్‌తో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15)లో తన రికార్డును తానే తిరగరాస్తూ మార్చి రెండో వారానికే 94.34 శాతం పీఎల్‌ఎఫ్‌తో దేశంలోనే ముందంజలో ఉండడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల (మార్చి) రెండో వారానికే 94.34 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) ను నమోదు చేసుకున్న కేటీపీపీ మొదటి దశ (500 మెగావాట్లు) ప్రాజెక్టు మరోసారి దేశానికి తలమానికంగా నిలువనున్నది. రాష్ట్రంలో భారీగా ఉన్న విద్యుత్ లోటు నేపథ్యంలో జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు స్వీయపర్యవేక్షణలో ఇటీవల ఏకధాటిగా 153 రోజులకు పైగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. సీఎండీ కనుసన్నల్లో విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది నిరంతరం విద్యుత్‌ఉత్పత్తిలో భాగస్వాములయ్యారు. కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్లో 94.34 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో కేటీపీఎస్ యూనిట్ ముందంజలో కొనసాగుతున్నది.
–  రాజేందర్, చెల్పూర్ రిపోర్టర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *