ఉత్తరాది వ్యూహాలకు చెక్‌పెట్టిన దక్షిణ భారతం

దక్షిణాది ముద్ర :
ఉత్తరాది రాజకీయాలకు, దక్షిణాది రాజకీయాలకు స్పష్టమైన తేడా జాతీయ పార్టీలకు ఎరుకైంది. కర్నాటకంలో సాగిన పర్వాలు, జరిగిన పరిణామాలు ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ.. ప్రజలే కాదు.. రాజకీయ నాయకులు కూడా తమదైన ముద్రను చూపించారు. దేశ రాజకీయాల్లో ఈ పరిణామం ఓ సరికొత్త అనుభవాన్ని రుచిచూపించింది.
మొదటినుంచీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీజేపీ.. కర్నాటకలో చతికిలపడింది. కేంద్రంలో అధికారం ఉందన్న ధీమాతో పావులు కదిపి.. ఆఖరినిమిషంలో వెనకడుగువేసింది. సంఖ్యా బలం నిరూపించుకోకముందే.. విశ్వాస పరీక్షకు సాహసించకుండానే.. యడ్యూరప్ప రాజీనామా చేశారు. మూడోసారి.. మూడురోజుల ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు.
బెడిసికొట్టిన ప్లాన్‌ :
దక్షిణాది ప్రజా ప్రతినిధులు బీజేపీ ప్రలోభాలకు లొంగకపోవడమే ఈ పరిణామానికి ప్రధాన కారణం. ఉత్తరాదిలో, ఈశాన్యంలో మాదిరిగానే.. ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చుననుకున్న బీజేపీకి దక్షిణాది ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఏ స్థాయిలో ప్రలోభ పెట్టినా..  చివరకు ఐటీ, సీబీఐ దాడులంటూ వార్నింగ్‌లకు సిద్ధపడ్డా ప్రయోజనం దక్కలేదు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుతో దక్షిణాదిలో పాగా వేద్దామనుకున్న ప్లాన్‌ బెడిసికొట్టింది.
శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ :
కర్నాటక పరిణామం అటు.. దేశ ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ క్రమంగా ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ.. ఇప్పటిదాకా 21 రాష్ట్రాల్లో పాగా వేసిన కాషాయపార్టీ.. దక్షిణాది కోసం తన శక్తియుక్తులన్నీ ధారపోసింది. మోదీ, అమిత్‌షా వంతుల వారీగా కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులను నియోజకవర్గాలు తిప్పారు. కానీ.. మ్యాజిక్‌ మార్క్‌ను మాత్రం చేరుకోలేకపోయారు. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచినా.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరమున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయారు.
విలువలు కాపాడిన దక్షిణాది ఎమ్మెల్యేలు :
ఈ నేపథ్యంలో ఆరు నూరైనా కర్నాటకలో కాషాయజెండా ఎగురవేయాలనుకొన్న బీజేపీకి… ఇక్కడి ఎమ్మెల్యేలు ఛాన్స్‌ ఇవ్వలేదు. గోవా, మేఘాలయల్లో మాదిరిగా.. ప్రలోభాలకు లొంగలేదు.  ఫలితంగా దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన కర్నాటక రాజకీయంలో బీజేపీ వెనుకడుగు వేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నయానా, భయానా ప్రయత్నించినా.. వాళ్ల ఆశలు విఫలమయ్యాయి. చాలా గంభీరంగా వ్యవహరించిన దక్షిణాది ఎమ్మెల్యేలు విలువలు కాపాడారన్న పేరును నిలబెట్టారు.
అప్పుడేం జరిగింది ? 
కర్నాటక సీన్‌ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరించిన తీరు చర్చను లేవనెత్తింది. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉండగా…కాంగ్రెస్‌పార్టీ 17స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది.అయితే.. మిగతా చిన్నపార్టీలు, స్వతంత్ర్య ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అటు మణిపూర్‌లోనూ ఇలాగే జరిగింది. మణిపూర్‌లో కాంగ్రెస్ 28 స్థానాల్లో, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాలు సాధించినా.. స్వతంత్రులు, ఇతర పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరోవైపు.. మేఘాలయాలోనూ ఇదే అనుభవం నమోదైంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా.. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. 19 సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీతో జతకలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బీహార్‌లోనూ 2015 ఎన్నికల్లో మొత్తం 243 సీట్లకు ఆర్జేడీ 80 స్థానాల్లో గెలిచింది. జేడీయూ 70 చోట్ల, బీజేపీ 53 స్థానాల్లో, కాంగ్రెస్‌ 27 స్థానాల్లో విజయం సాధించాయి. కానీ.. బీజేపీ.. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ అయిన ఆర్జేడీని కాదని జేడీయూతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
పై నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సమయంలో బీజేపీ ప్రలోభాలకు పాల్పడిందన్నది సుస్పష్టం. లేదంటే ఇతర పార్టీలు వాళ్లకు అండగా నిలిచే పరిస్థితి లేదు. అదికూడా సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీలను కాదని, బీజేపీ.. తనదైన వ్యూహాలతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. బతిమిలాడటమో, భయపెట్టడం వల్లో ఆ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చారు. కానీ.. కర్నాటకలో మాత్రం.. బీజేపీ ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసినా.. ఇక్కడి ఎమ్మెల్యేలు గాలానికి చిక్కలేదు.
కర్నాటకం వెనుక తెలుగు శక్తి :
ప్రధానంగా కర్నాటక పరిణామాల్లో ఎవరికీ తెలియని మరో ట్విస్ట్‌ ఉంది. జాతీయ స్థాయిలో దక్షిణాదికి చెందిన కర్నాటకను ప్రలోభాలకు దూరంగా హీరోగా నిలబెట్టిన ఘనత వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ ప్రయత్నం ఉంది. అదీ.. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ కనుసన్నల్లో నడిచింది. కర్నాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంప్‌ హైదరాబాద్‌కు మారినప్పటినుంచీ.. నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ తెరపైకి వచ్చారు. కర్నాటక ఎమ్మెల్యేల క్యాంప్‌ రాజకీయాలను భుజానికెత్తుకొని పకడ్బందీగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీకి ఏ ఒక్కరూ చిక్కకుండా చూశారు. కర్ణాటక సీన్‌ మొత్తానికి రక్తి కట్టించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *