
కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి ఏపని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. కరీంనగర్ లో డ్రోన్ కెమెరాలు ప్రవేశపెట్టి మందు బాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన మానేరుడ్యామ్, ఉజ్వల పార్క్, ఢీర్ పార్క్ పరిసర ప్రాంతాలలో మహిళలు ఊపిరి పీల్చుకునేలా, ఉల్లాసంగా గడిపేలా చర్యలు చేపడుతున్నారు.
సందర్శన, శివారు ప్రాంతాల్లో అసాంఘీక, అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం వినియోగిస్తున్న డ్రోన్ కెమెరాలు సత్పలితాలనిస్తున్నాయి. తాజాగా గురువారం నాడు మానేరుడ్యాం శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 10మంది మందుబాబులను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం మానేరుడ్యాం శివారు ప్రాంతంలో పోలీసులు డ్రోన్ ను ప్రయోగించారు. డ్రోన్ కెమెరాల ద్వారా అందిన ఛాయాచిత్రాల ఆధారంగా సదరు ప్రాంతంలో పోలీసులు మెరుపుదాడి జరిపి మందుబాబులను అరెస్టు చేశారు. అరెస్ట్తెన మందుబాబుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మార్కండేయకాలనీకి చెందిన రాఘుల కనుకయ్య, జడియాల స్వామి, సప్తగిరికాలనీకి చెందిన రాయిశెట్టి వినయ్, సైదాపూర్ నకు చెందిన రాయిశెట్టి అకిల్, జక్కి వెంకటేష్, కాపువాడకు చెందిన నిమ్మ మహేందర్ రెడ్డి, లక్ష్మినగర్ కు చెందిన నాంపల్లి ఆదిత్య, హుజూరాబాద్ నకు చెందిన మొలుగు భానుచందర్, గోదావరిఖనికి చెందిన కాశిపాక ప్రశాంత్, కాశిపాక వినీత్ లను అరెస్టు చేశారు. వీరివద్ద నుండి రెండు కార్లు,మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని ఎస్ఐ రమేష్ తెలిపారు.
ఈ దాడి జరిపిన బృందంలో ఆర్ ఎస్ఐ జానీమియా, క్యూఆర్టి ఆర్ ఎస్ఐ కుమారస్వామి, ఐటికోర్ టీం యంఎస్ ఖురేషి బృందాలు పాల్గొన్నాయి.