Breaking News

ఈసారి నిర్ణయం తీసుకోకపోతే…కంపెనీ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది : మంత్రుల హెచ్చరిక

ఈసారి నిర్ణయం తీసుకోకపోతే...కంపెనీ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది : మంత్రుల హెచ్చరిక

ఈ నెల 12వ తేదీలోపు కార్మికులకు వేతనం చెల్లించాలి

 ఫిబ్రవరి 14వ తేదీన బోర్డ్ మీటింగ్ లో కంపెనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాలి

 ఫిబ్రవరి మూడో వారంలో మరోసారి కంపెనీ ప్రతినిధులు, యూనియన్లతో సమావేశం

బిల్ట్ కంపెనీ ప్రతినిధులు, కార్మికుల సంయుక్త సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్.

హైదరాబాద్,  ఈ నెల 12వ తేదీలోపు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్-బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్) కార్మికులకు ఒక నెల వేతనం చెల్లించాలని ఆ ఫ్యాక్టరీ సీఈవో నిహార్ అగర్వాల్ ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్ ఆదేశించారు. కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడడంతో గత 32 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కంపెనీ తమ గోడును పట్టించుకోవడం లేదని ఈ కంపెనీ కార్మికులు మంత్రులకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన ఫ్యాక్టరీ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు, కార్మిక యూనియన్ నేతలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ సమావేశమై చర్చించారు. ఈ నెల 14, 15తేదీల్లో సంక్రాంతి పండగ ఉండడంతో కచ్చితంగా ఈ నెల 12వ తేదీలోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, ఫిబ్రవరి నెలలోపు ఫ్యాక్టరీ  భవితవ్యాన్ని తేల్చాలని చెప్పారు. ప్రధానంగా ఇటీవల పేపర్ పల్ప్ కు ధర పెరగడంతో ఈ రేయాన్స్ ఫ్యాక్టరీని పేపర్ పల్ప్ ఫ్యాక్టరీగా మార్చి నడిపించే ప్రతిపాదనలను పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులుకు మంత్రులు సూచించారు. లేనిపక్షంలో ఫ్యాక్టరీని మూసివేయాలనుకుంటే కార్మికులకు రావల్సిన అన్ని బకాయిలు చెల్లించాలన్నారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 14వ తేదీన కంపెనీ బోర్డ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫ్యాక్టరీ సీఈవో చెప్పారు. ఈసారి తుది నిర్ణయం ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాలని, ఇంకా నిర్ణయాన్ని వాయిదా వేయడం కుదరదన్నారు. ఈసారి ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని తీసుకోలేకపోతే…ప్రభుత్వం ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు ఫిబ్రవరి మూడో వారంలో మరోసారి సచివాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. వీలైనంత వరకు ఫ్యాక్టరీ నడపడానికి యాజమాన్యాన్ని ఒప్పించి రావాలని కంపెనీ సీఈవో అగర్వాల్ కు చెప్పారు.

ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమిషనర్ భాగ్యనాయక్, బిల్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వై. కేశవరెడ్డి, బిల్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *