ఇసుక సేకరించుకోవడానికి నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం

 సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరణపై అధికారులతో పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష

 సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరణపై మార్చి 31 వరకు నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయం

 క్యూబిక్ మీటర్ కు 40 రూ.ల సీనరేజీ ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇసుక సేకరించుకునేందుకు వెసులుబాటు

 క్యూబిక్ మీటర్ కు చెల్లించాల్సిన 560 రూపాయల చార్జీలను మినహాయించాలని నిర్ణయం.

 2017-18 బడ్జెట్ పై ఐటీ శాఖ రూపోందించిన సమ్మరీ బుక్ లెట్ విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, జూపల్లి

హైదరాబాద్: సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరించుకోవడానికి నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 లోగా దాదాపు 600 కోట్లతో దాదాపు 15 వందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పనులు చేపట్టింది. అయితే ఈ సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ అంశంపై సచివాలయంలో శుక్రవారం మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ధర్మారెడ్డి లు కూడా ఇసుక సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తెచ్చారు. దీనిపై అధికారులతో కూలంకశంగా చర్చించిన మంత్రులు ఇసుక సేకరణలో నిబంధనలను ఈ నెల 31 వరకు సడలించాలని నిర్ణయించారు. జిల్లాల్లో అవసరం మేరకు అదనపు ఇసుక రీచ్ లకు కలెక్లర్లు అనుమతి ఇచ్చేందుకు వెసులు కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఇప్పటి వరకు క్యూబిక్ మీటర్ కు వసూలు చేస్లున్న 560 రూపాయలను మినహాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి క్యూబిక్ మీటర్ కు కేవలం 40 రూపాయల సీనరేజీ చార్జీ చెల్లించి సీసీ రోడ్ల కోసం ఇసుకను సేకరించుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిబంధనల సడలింపు ఈ నెల 31 వరకు మాత్రమే వర్తిస్తుందని మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా నెలాఖరులోగా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్ పై బుక్ లెట్ ఆవిష్కరించిన మంత్రులు

2017-18 బడ్జెట్ పై ఐటీ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఓపెన్ డాటా యూనిట్ రూపొందించిన సమ్మరీ బుక్ లెట్ ను మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. గత మూడేళ్లుగా బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులకు సంబంధించిన శాఖల వారి వివరాలను గ్రాఫ్ ల రూపంలో ఈ బుక్ లెట్ లో పొందుపరిచారు. అందరికి అర్ధమయ్యేలా అంకెలతో సహా వివిధ శాఖలకు ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులను, గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు ఎంత మేర పెరిగిందో స్పష్టంగా అర్ధమయ్యేలా ఈ బుక్ లెట్ రూపొందించారు. వివిధ అంశాలపై ఇలాంటి బుక్ లెట్ లను మరిన్ని రూపొందించేందుకు ఐటీ ఓపెన్ డాటా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *