
కరీంనగర్: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకబ్భందీ చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రతినిత్యం చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, అయినా కొన్ని ప్రాంతాల నుండి గుట్టు చప్పుడు కాకుండా రవాణా అవుతున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఆయా చెక్ పోస్టులను మరింత బలోపేతం చేయడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులను గుర్తించడం జరిగిందని, వారందరిని బైండోవర్ చేస్తామని పేర్కొన్నారు. గత 20 రోజుల వ్యవధిలో పోలీస్ శాఖ రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాదారులపై దాడులు జరిపి 40 కేసులను నమోదు చేసి 44 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. సదరు అక్రమ రవాణాదారులు, వాహనాలకు 10,57 లక్షల జరిమాన విధించడం జరిగిందని వివరించారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక పక్క విరామం ఎరుగకుండా శాంతిభద్రతల పరిరక్షణ విధులను నిర్వహిస్తూనే మరోపక్క ఇసుక అక్రమ రవాణాకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.