
హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ తొలి మహిళా పైలట్‌కు అవసరమయ్యే శిక్షణా ఖర్చులు భరించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై ఒపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. గతంలో కూడా ఎన్నో అవార్డులు సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరిగే 13వ సీనియర్ ఏషియన్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొననున్నది. దీనికోసం అవసరమయ్యే మెరుగైన శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సయిదా ఫలక్ సెక్రటేరియట్లో సోమవారం ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలుసుకున్నది. కరాటేలో రాణిస్తున్నందుకు సయిదాను అభినందించిన ముఖ్యమంత్రి శిక్షణకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామినిచ్చారు. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో రాణించడంతో పాటు భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన గంటా స్వాతిరావు 2006లో పైలట్‌గా ఎంపికయ్యింది. తెలంగాణ నుంచి మొదటి పైలట్ అయిన స్వాతిరావు ఫిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నది. ఏయిర్ బస్ పైలట్‌గా మారడం కోసం అవసరమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్వాతిరావు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వద్దకు వచ్చింది. ఆమెను అభినందించిన ముఖ్యమంత్రి శిక్షణకు కావాలసిన ఖర్చును భరిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.