ఇద్దరు చంద్రులకూ సిగ్గుచేటు

ఒకరి లక్ష్యం బంగారు తెలంగాణ. మరొకరి ఆశయం స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కొత్త రాష్ట్రాలను గాడిలో పెట్టడానికి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా… ఒక విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన వైఫల్యం కనిపిస్తోంది.

దేశమంటే మనుషులు. మనిషి కనీస అవసరాల్లో మొదటిది కూడు. అది కావాలంటే రైతు పండించాలి. అన్నం పెట్టే రైతే ఆత్మహత్యే శరణ్యం అనుకుంటే ఇక దేశానికి దిక్కెవరు? దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉండటం బాధాకరం.

రైతుల కోసం చాలా చేస్తున్నాం, వేలకోట్ల సబ్సిడీ భరిస్తూ ఉచిత కరెంటు ఇస్తున్నాం అని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి. మరిన్ని వేలకోట్ల భారం భరిస్తూ రుణ మాఫీ చేశామని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులూ డంకా బజాయించి చెప్తుంటారు. మరి రైతు ఆత్మహత్యలు ఆగాయా? ఇప్పటికీ రోజూ ఏదో ఒక పొలంలో రైతు శవంగా మారుతున్నాడు. ఏదో ఒక ఊళ్లో అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకు?

ఈ ఎందుకు అనే ప్రశ్న వేసుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఇష్టం లేదో లేక టైమ్ లేదో అర్థం కాదు. వాటర్ గ్రిడ్, వగైరాలపై అవగాహన కోసం తెలంగాణ ప్రతినిధులు అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. ఏపీ నుంచైతే సీఎం సహా ఓ పెద్ద బృందం ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో పర్యటించింది. అయితే, మన దేశంలోనే ఉన్న ఒక రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనిస్తే మంచిది.

గుజరాత్ లో ఉచిత విద్యుత్తు పథకం లేదు. రైతుల రుణాలు మాఫీ చేయలేదు. అయినా అక్కడ రైతు ఆత్మహత్యలు జరగడం లేదు. లేదా, చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు? మంచి ఎక్కడున్నా గ్రహించాలి. గుజరాత్ లో వలె మన రైతులు ఆత్మహత్య చేసుకోకుండా నిండు నూరేళ్లూ జీవించే పరిస్థితి రావాలని మనం కోరుకోమా? కచ్చితంగా కోరుకుంటాం. కేసీఆర్, చంద్రబాబు కూడా కోరుకుంటారు.

నరేంద్ర మోడీ హయాంలో జరిగిన అద్భుతాలేంటో ఒక్కసారి ఈ ఇద్దరు సీఎంలూ తెలుసుకోవాలి. ప్రజలు గానీ రైతులు గానీ బిచ్చగాళ్లు కాదనేది మోడీ ఉద్దేశం. తాయిలాలతో వాళ్లను బిచ్చగాళ్లుగా మార్చేకంటే సరైన పద్ధతిలో వారిలో స్థయిర్యాన్ని నింపడం, నిజంగా అవసరమైన సహాయం చేయడం ముఖ్యమని భావించారు. రైతులకు కొంత సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తారు. అయితే, రోజుకు ఏ సమయంలో ఎన్నిగంటలు సరఫరా చేస్తామని ప్రకటిస్తారో, కచ్చితంగా సరఫరా చేస్తారు. ఉదయం ఓ గంట, మధ్యాహ్నం రెండు గంటలు, అర్ధరాత్రి మరో గంట… ఈ అవస్థలు రైతులకు లేవు.

విత్తనాలు, ఎరువుల కోసం లైన్లో నిలబడి ఎండ వేడికో గుండె పోటుకో రైతులు మరణించే దుర్భాగ్య పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉంది. గుజరాత్ లో ఆ పరిస్థితి లేదు. అక్కడ నిజగా రైతే రాజు. పంటను మార్కెట్లో అమ్ముకునే సమయంలో మన రైతులను పురుగుల్లా చూస్తారు. గుజరాత్ లో ఆ దుస్థితి లేదు. అందుకే, సరిగా పంటలు పండి, ఎంతో కొంత లాభం వస్తుంది కాబట్టే రైతులు కరెంటు బిల్లు కట్టడానికి బాధ పడరు. రుణాలు పొందడం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత దారుణంగా ఉండదు.

అసలు గుజరాత్ లో ఏం జరుగుతోంది? అక్కడి రైతులు అంత  సుభిక్షంగా ఎందుకున్నారు? ఆ విధానాలు అన్ని, లేదా కొన్ని మనం అమలు చేయవచ్చా అనేది తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆలోచిస్తే… అన్నదాతకు మేలు జరుగుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *