
(నోముల రవీందర్ రెడ్డి, జర్నలిస్ట్)
తాడిత, పీడిత ప్రజల కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరటంలో అసువులు బాసిన అమరుల త్చాగాలకు, ప్రజల చైతన్యనానికి ఒక చిహ్నాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ఆవిష్కరించిందే హుస్నాబాద్ అమరవీరుల స్థూపం. అసలైన ఎర్రజెండా కింద పేద, బీదా అందరూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో ఊరూరా కదిలి భూస్వాముల నుంచి భూములు లాక్కున్నారు. సాగుచేశారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక రక్షణ వలయంలా అప్పటి నక్సలైట్లు నిలబడ్డారు., ప్రజలు అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వంలో కదులుతూ పోరాటాలు చేస్తున్న క్రమంలో చాలామంది అమరులయ్యారు. 1977లో జరిగిన జగిత్యాల రైతాంగ పోరాటం కరీంనగర్ జిల్లాలోనే కాదు, భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో పీపుల్స్ వార్ పాగా వేయడానికి ఒక నాంది పలికింది. అయింది. ఇదే సందర్భంలో జల్ జంగల్, జమీన్ మీద పేదప్రజలకు పూర్తి హక్కులు, స్వేచ్ఛ ఉండేది. నిత్య నిర్భంధలోనైనా , స్వేచ్ఛాయుత వాతావరణం అప్పుడు ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణం అనే పేరు మీద నిత్య నిర్భంధం సాగుతోంది.
అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వంలో ప్రజలు భారీగా తరలివచ్చి, 1977నుంచి 1990 వరకు కరీంనగర్ జిల్లాలో అమరులైన 97 మంది అమరుల జ్ఞాపకంగా 88 అడుగుల ఎత్తైన స్తూపాన్ని నిర్మించారు. దీనికి ఏడాదికాలం పట్టింది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ కేంద్రంగా ఉన్న ఈ స్తూపం నిర్మాణంలో హుస్నాబాద్, హుజూరాబాద్, సరిహద్దునే ఉన్న వరంగల్ జిల్లాలోని చేర్యా, మద్దూరు, తరిగొప్పుల ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్క పనిని ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే పారదర్శకంగా చేశారు.
ఈ స్తూపం నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కూలిపోయి ఒక సుతారి ప్రాణాలను కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా అమరుడైన మాసాని రవీందర్ తల్లి అక్కడే గుడిసె వేసుకొని ఉండి నిర్మాణ బాధ్యతలను చూసుకుంది. అక్కడికి వచ్చే ప్రజలు ఇచ్చిన బియ్యం, ఉప్పు, పప్పులతో నిర్మాణ పనుల్లో పాల్గొన్న ప్రజలు ఆకలిని తీర్చేది. ఈ విధంగా నిర్మాణం పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 25 1990న ఇదే ప్రాంతానికి చెందిన పీపుల్స్ వార్ నాయకుడు పులిరాములు తండ్రి మల్లయ్య ఆవిష్కరించాడు. అదే సంవత్సరంలో విరసం నేత వరవరరావు ప్రజాయుద్ధనౌక గద్దర్ సమక్షంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నాయకులు పాల్గొన్నారు. ఇది ప్రజలతో చైతన్యాన్ని నింపిన ప్రకాశవంతమైన స్తూపం అని కొనియాడారు.
అయితే 1992లో మొదటిసారిగా క్రాంతి సేన పేరుతో స్తూపాన్ని కూల్చివేశారు. ఆ తర్వాతి కాలంలో పీపుల్స్ వార్ అగ్రనేతలు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి 1999 డిసెంబర్ నెలలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇంటిని పేల్చేశారు. దీంతో గ్రీన్ టైగర్స్ పేరుతో డిసెంబర్ 31న అమరుల స్తూపాన్ని ఈ ప్రాంత ప్రజల ఆశయ సౌధాన్ని డైనమేట్ పెట్టి కూల్చేశారు.
అయినప్పటికీ ఇది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.