ఇతర రాష్ట్రాలలో మార్కెటింగ్ అధికారుల పర్యటన – మంత్రి హరీశ్ రావు.

ఇతర రాష్ట్రాలలో మార్కెటింగ్ అధికారుల పర్యటన.

పంటల దిగుబడి, మద్దతు ధర,మార్కెటింగ్ విధానాలపై అధ్యయనం.

రైతులకు మెరుగైన సేవలందించేందుకు పర్యటన.

జనవరి 13 నాటికి నివేదిక.

మార్చి కల్లా గోడౌన్లను పూర్తి  చేయాలి. -మంత్రి హరీశ్ రావు.

మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ హర్యానా తదితర రాష్ట్రాలలో మార్కెటింగ్  ఉన్నతాధికారుల బృందం పర్యటించాలని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆదివారం ఇక్కడ బి.ఆర్.కె. భవన్ లోని మార్కెటింగ్ డైరెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఆయా రాష్ట్రాలలో వివిధ వ్యవసాయఉత్పత్తులు, కూరగాయలను, రైతులకు  ప్రభుత్వాల నుంచి లభిస్తున్న కనీస మద్ధతు ధరలపై అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే పంటల దిగుబడి, వాటి కొనుగోలు విధివిధానాలను, అక్కడ అవలంబిస్తున్న మంచి పద్దతులను పరిశీలిం చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త విధానాలను ప్రవేశ పెట్టడానికి వీలుగా ఈ నెల 13వ తేదిలోగా  అధికారుల బృందం నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల, జిన్నింగ్ మిల్లుల, పప్పు మిల్లుల, ఆయిల్ మిల్లుల వివరాలు, వాటి మిల్లుంగ్ సామర్ధ్యం, ఆయా ప్రదేశాలలో అంచనా వేసిన వివిధ పంటల ఉత్పత్తులు తదితర వివరాలను ఈ నెల 13వ తేదిలోగా సంబంధిత జిల్లా మార్కెటింగ్ అధికారులు ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని హరీశ్ రావు ఆదేశించారు. మన కూరగాయల విక్రయ కేంద్రాలను జి.హెచ్.ఎం.సి. సమీకృత మార్కెట్ లలో అనువైన మెట్రో రైల్వే స్టేషన్ లలో త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.  మనకూరగాయల విక్రయ కేంద్రాలలో ఆర్గానిక్ కూరగాయలను, సేంద్రియ బియ్యం అమ్మడానికి సంబంధిత రైతులను ప్రోత్సహించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

మొత్తం 330 నాబార్డు గోదాములలో మిగిలిన 18 గోదాముల నిర్మాణం, ఈ మార్చి 2018లోగా ఎట్టి పరిస్తితులలోను పూర్తి చేయాలని ఆదేశించారు. మూడవ దశలో నిర్మిస్తున్న 34 గోదాముల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని హరీశ్ రావు  ఆదేశించారు.  స్థల వివాదం ఉన్న గోదాములకు సంబంధించి, సంబంధిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, స్థలం వెంటనే కేటాయించేటట్లు చూసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించా రు.  సూర్యపేట, చివ్వేంల తదితర ప్రదేశాలలో గోదాముల నిర్మాణానికి స్థల విషయంలో ఉన్న సమస్యలపై  మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించి స్ధలం కేటాయించేలా చూడాలని కోరారు.

నిర్మాణాలు పూర్తయిన గోదాములను సంబంధిత మార్కెట్ కమిటీలకు  వెంటనే అప్పగించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన నాబార్డు గోదాములను సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్లతో మాట్లడి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, భారత కాటన్ కార్పొరేషన్, భారత అహార సంస్థ తదితర ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వరంగ సంస్థలు మార్కెటింగ్ శాఖ గోదాములను అద్దెకు తీసుకోవాలని, గోదాములను పూర్తి వినియోగంలోనికి తేవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మోడల్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యాపారస్థులను, కమిషన్ ఏజెంట్లకు కొత్తగా జారి చేసే లైసెన్సుల విషయంలో, అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న లైసెన్స్ లకు సంబంధిత వర్తకులు, కమిషన్ ఎజంట్లు ఇవ్వ వలసిన బాంక్ పూచికత్తు విషయంలో అవగాహన కల్పించి నూతన లైసెన్స్ లు జారి చేయాలని ఆదేశించారు.

వ్యాపారంలో పోటి పెంచి, పంటకు ఎక్కువ ధర వచ్చేటట్లు చూడాలని కోరారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడ వ్యాపార లైసెన్స్ లు జారి చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని వివిధ వ్యవసాయ మార్కెట్ ల నియంత్రణలో నడుస్తున్న పశువుల మార్కెట్ల ద్వారా మార్కెట్ ఫీజు వసూలు సక్రమంగా లేవన్నారు. గ్రామపంచాయితీలలో  నిర్వహించే పశువుల మార్కెట్లలో సంవత్సరానికి కోట్ల రూపాయలలో ఆదాయాలు వస్తుంటే మార్కెట్ కమిటీల పశువుల మార్కెట్ల ద్వార  లక్షలలో ఆదాయం వస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018 మార్చిలోగా అన్ని పశువుల మార్కెట్లలను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించాలని ఆదేశించారు. మార్కెట్ ఫీజ్ వసూలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెటింగ్ శాఖలో చాలా కాలంగా వివిధ హోదాలలో ఉన్న ఖాళీలను  త్వరతగతిన భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న పని భారం అలాగే, రాబోయే రోజులలో కోటి ఎకరాల సాగు, ఫలితంగా వచ్చే ఉత్పత్తి, ఆధారంగా పనిభారం అంచనా వేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవసరమైన మేరకు నూతన పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి గారు, సంయుక్త సంచాలకులు, లక్ష్మణుడు, రవికుమార్, మార్కెట్ కార్యదర్శులు,  ఇంజనీరింగ్ అధికారులు  పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *