
ఢిల్లీ , ప్రతినిధి : దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీపై సరైన అవగాహన లేదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ విధించడం ఇందిరాగాంధీ పాలనకు మాయని మచ్చలా మారిందని ప్రణబ్ రాసిన ‘డ్రమటిక్ డికేడ్ ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన 79వ పుట్టిన రోజు సందర్భంగా ఆ పుస్తకాన్ని ఆన్లైన్లో విడుదల చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లారని పుస్తకంలో వివరించారు. దేశంలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకున్నాయని పత్రికలపై ఆంక్షలు పెట్టారని చెప్పారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ విషయాలన్నీ ఇందిరాగాంధీకి తెలియవని ప్రణబ్ తెలిపారు. అప్పటి రాష్ట్రపతి పాలనలో కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్‌రాయ్ కీలకపాత్ర పోషించారని ప్రణబ్ చెప్పారు.