
కరీంనగర్: జిల్లాలో ఇండ్లపైన గల ప్రమాదకరమైన విద్యుత్ లైన్లన్నింటిని వేగవంతంగా తొలగించాలని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ట్రాన్సుకోఎస్.ఇ కార్యాలయంలో విద్యుత్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇండ్లపై లైన్లను తొలగించుటకు 10కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రమాదకరమైన లైన్లవల్ల ఎందరో అమాయక ప్రజలు చనిపోతున్నారని అన్నారు. మొత్తం వైర్లు తొలగించుటకు 32 కోట్లు అంచనా వేశారని మొదటి విడతగా 10కోట్లు మంజూరు తెలిపారు. మిగిలినవి త్వరలో ఇస్తామని అన్నారు. జిల్లాలో ఎక్కడ లూజ్ లైన్లు కనపడవద్దని అన్నారు. వీటివల్ల సంస్ధకు లైన్ లాసెస్ వస్తుందని అన్నారు. ప్రజలకు లో ఓల్టేజి సమస్య లేకుండా చూడాలని అన్నారు. తాగునీటి పధకాలకు విద్యుద్దీకరణ వేగంగా పూర్తి చేయాలని అన్నారు. రహదారులు, భవనాల శాఖ అధికారులు సమన్వయంతో కొత్త విద్యుత్ లైన్లు వేయాలని, సమన్వయం లేకపోవడం వల్ల వేసిన లైన్లు తిరిగి తొలగించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర్ర ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా ప్రజల చెమట సొమ్మని, దుబారా చేయవద్దని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ఎస్ఇ ట్రాన్సుకో ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.