
మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి నల్లానీళ్లతో పాటు ఇంటర్నెట్ ను అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేస్తున్న మిషన్ భగీరథ పనుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మరో మేలు జరుగబోతోంది. మిషన్ భగీరథ పనుల కోసం ప్రస్తుతం పైపు లైన్లు వేసేందుకు తవ్వకాలు చేపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ పనుల్లో భాగంగా వాటితోనే ఇంటర్నెట్ , ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను ప్రతీ గ్రామానికి, ఇంటికి అందించేందుకు ఫైబర్ కేబుల్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.. ఈ మేరకు తెలంగాణ ఐటీ , పంచాయతీరాజ్ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది..
ఫ్రిబ్రవరి నుంచి మిషన్ భగీరథ పనులతో పాటు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు అవసరమైన ఇంటర్నెట్ ఫైబర్ తీగలను పైపులతో కలిసి వేస్తారు. దీంతో ప్రతీ ఊరికి, ఇంటికి నీటి కోసం నల్లా లైనుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇంటర్నెట్ కోసం లైన్లు వేసే ఖర్చు తప్పినట్టైంది. దాదాపు వందల కోట్ల రూపాయలు మిగలనున్నాయి..
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఆధునాతన సాంకేతిక కోసం వందల కోట్లను రాష్ట్రప్రభుత్వాలకు విడుదల చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణకు నిధులు ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటర్నెట్ తీగలను వేస్తుండడంతో భారీగా ఖర్చు తగ్గి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు తోడ్పాటు కానుంది. మొత్తానికి తెలంగాణ ప్రబుత్వ ఐడియా ప్రజలకు నల్లా నీటితో పాటు ఇంటర్నెట్ ను అందించనుంది.