ఆ నవ్వులు జనాన్ని భయపెట్టాయి..

అది కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం. గోవిందులు ఇంటి బయట కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. రోజూ సాయంత్రం అతని పిల్లలు అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్లు. ఒకరోజు అలా ఆడుకుంటున్నప్పుడు వారికిఒక వింత శబ్దం వినిపించసాగింది. పిల్లలంతా ఆటలు ఆపేసి, చెవులప్పగించి విన్నారు… అది ఒక పిల్లవాడు నవ్వుతున్నట్టు ఉంది.. కొబ్బరిచెట్ల పై నుంచి వస్తుంది. కొంచెం సేపు వచ్చి ఆగిపోతుంది… మరల వాళ్ళు ఆడుకుంటుంటే వస్తుంది. వాళ్ళు కొంచెం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళకు చెప్పారు.. కొబ్బరి చెట్లపై ఎవరో పిల్లవాడు ఉన్నాడన్నారు.. దానికి పెద్దలు నవ్వుతూ తుంటరి వెధవల్లారా మమ్మల్ని ఆటపట్టించడానికిఈ రోజు ఏప్రిల్ ఫష్ట్ కాదు అన్నారు.మరుసటి రోజు పిల్లలు ఆడుకుంటున్నారు.అదే శబ్దం, అవే నవ్వులు.. కొబ్బరి చెట్ల పై నుంచి.. ఈసారి పిల్లలు వెంటనే పరిగెత్తుకొని వెళ్లి ఇంట్లో పెద్దవాళ్ళని వెంట తీసుకుని వచ్చారు.. ఏ శబ్దమూ లేదు.. వాళ్ళు వెళ్ళిపోదామనుకుంటున్న సమయానికి మరలా పిల్లవాడి నవ్వులు వినిపించసాగాయి.. ఈ సారి అందరూ విన్నారు. పెద్ద వాళ్లకు కూడా భయం వేసింది.. అలా మరో రెండు రోజులు గడిచాయి… కొబ్బరి చెట్ల పై నుంచి నవ్వులు ఆగలేదు.. వెంటనే వాళ్ళు ఊరిలోని ఒక పేరున్న జ్యోతిష్కుడిని కలిశారు. అతడు సవా లక్ష ప్రశ్నలు వేసి, మీ కొబ్బరి చెట్ల పై కొన్ని ప్రేతాత్మలు ఉన్నాయి, వాటిని వెళ్లగొట్టడానికి ఒక హోమం, కొన్ని పూజలు చెయ్యాలన్నాడు. వెంటనే ఏర్పాట్లు చేశారు.. హోమాలు, పూజలు అన్నీ మరుసటి రోజే జరిపించారు. అయినా నవ్వులు ఆగలేదు. ఆ కుటుంబం మొత్తం ఇంకా భయ భ్రాంతులకు గురయ్యారు. ఏమి చేయాలో అర్థం కాలేదు…ఇంతలో ఒక వ్యక్తి వాళ్ల ఇంటికి వచ్చాడు..అతను వాళ్ల కొబ్బరి చెట్ల నుంచి కాయలు దించే ఆసామి. పది రోజుల క్రితమే వచ్చాడు. మరలా అప్పుడే వచ్చావేమిటని అడిగారు. అయ్యా నేను నా సెల్ ఫోను ఎక్కడో మరచి పోయాను.. నేనెక్కిన చెట్లన్నీ వెతుకుతూ తిరుగుతున్నాను., కాస్త మీ చెట్లమీదేమైన మరచిపోయానేమో ఒకసారి చూసుకోనివ్వండన్నాడు. వాళ్ళు ఒప్పుకోవడం, అతను చెట్టు ఎక్కి తన సెల్ ఫోన్ తో దిగి రావడం క్షణాలలో జరిగిపోయింది.. అప్పటికి గాని వాళ్లందరికీ విషయం అర్థం కాలేదు. అతడు పది రోజుల క్రితం కాయలు దించడానికి వచ్చినప్పుడు ఫోను వాళ్ళ చెట్టుపై మరచిపోయాడు, అతను ఫోనుకి పిల్లాడి నవ్వుల రింగ్ టోన్ ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.