
-కేబినెట్ మహిళలకు నోఛాన్స్
-కొండా సురేఖపై వ్యతిరేకతతో దక్కని మంత్రి పదవి
-మురళికి ఎమ్మెల్సీతో బుజ్జగింపు
హైదరాబాద్, ప్రతినిధి: తెలంగాణ తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకుండా పోయింది.. అన్నింట్లో సగమైనా.. పదువుల పంపకంలో మాత్రమే సీఎం కేసీఆర్ మహిళా నేతలకు మొండిచెయ్యే చూపారు. మంత్రివర్గ విస్తరణలో పదవి ఖాయమనుకున్న కొండాసురేఖకు చివరినిమిషంలో సమీకరణాలు తారుమారై మంత్రిపదవి దక్కలేదు.
వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం రాజయ్య, స్పీకర్ మధుసూదనాచారి లు పదవుల్లో కొనసాగుతున్నారు. మళ్లీ ఆ జిల్లా నుంచే ములుగు ఎమ్మెల్యే చందూలాల్ కు ఎస్టీ కేటాగిరిలో చోటు లభించింది. ఇప్పటికే మంత్రివర్గంలో గిరిజనులకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఎస్టీ కేటగిరిలో సీనియర్ నాయకులు చందూలాల్ కు అవకాశం ఇచ్చారు. మహిళల విషయంలోనే ఎటూ తేల్చుకోలేక ఈసారి మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వలేదు.
కొండా సురేఖ విషయంలో మంత్రి పదవి ఖాయమనుకున్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు.. ఆమెకు మంత్రిపదవి వద్దంటూ టి.జేఏసీ , మరికొంతమంది నేతల విమర్శలతో సీఎం వెనక్కి తగ్గినట్లు తెలిసింది. సురేఖను మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నా అనవసరంగా విమర్శలకు తావివ్వద్దనే ఉద్దేశంతో విరమించుకున్నారు. ఇక మహిళల్లో సీనియర్ నేతలు లేకపోవడం కూడా మంత్రివర్గంలో మహిళా ప్రాతినిధ్యానికి చోటు లేకుండా చేసింది. మరో వైపు కొండా సురేఖను బుజ్జగించేందుకు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారని సమాచారం. రానున్నరోజుల్లో అందరికీ అవకాశం ఇస్తానని.. కొంత వేచి చూడండనే సూచనలతో కొండా సురేఖ సమ్మతించారని సమాచారం.