
హైదరాబాద్:ఆర్టీసి విభజనకు ఓ అడుగు ముందుకు పడింది. తెలంగాణ, ఏపీలకు ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలనే ఆర్టీసీ కూడా అనుసరిస్తోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల సూచన మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల జాబితాకే పేరు మార్చి ఆర్టీసీ మార్గదర్శకాలుగా విడుదల చేసారు.
స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపు….
మార్గదర్శకాల ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరుపుతారు. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు. భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు, ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాల వారికి ఆప్షన్ అడిగే అవకాశం కల్పించారు. ఈనెల ఏడు వరకు అభ్యంతరాల స్వీకరించి తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు.
అదనపు సిబ్బంది మరో రాష్ట్రానికి బదిలీ….
ఒక రాష్ట్రంలో పోస్టుల కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సిబ్బందిని మరో రాష్ట్రానికి బదిలీ చేస్తారు. ఏపీలో పోస్టుల సంఖ్యకన్నా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నందున అదనంగా ఉన్నవారు తెలంగాణకు రానున్నారు. దీని వల్ల పోతామంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మార్గదర్శకాలు పై సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాలు….
తెలంగాణకు చెందిన జేఎండీ రమణారావు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అడ్మిన్ ఈడీ వెంకటేశ్వరరావు సంతకాలతో మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తుది జాబితాను ఆమోదించి ఇరు రాష్ట్రాలకు పంపించిన అనంతరం షీలాభిడే కమిటీ ద్వారా కేంద్రానికి చేరుతుంది.