
అదుపులోనే సీజనల్ వ్యాధులు
బాగా తగ్గిన మరణాలు
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆయుష్ సేవలు
ప్రతిపాదనలు సిద్ధం చేయనున్న అధికారులు
కల్తీ లేని మోడల్ పట్టణాల తయారీ కల్తీ కఠిన చర్యలు తప్పవు
సమీక్షించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: స్త్వె ఫ్లూ, మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. వాటి డిటెక్షన్ కాస్త ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఆయా పేషంట్లకు తగిన వైద్యం అందిస్తున్నామని, అందువల్లే మరణాల సంఖ్య కూడా గణణీయంగా తగ్గిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సోమవారం సచివాలయంలో సీజనల్ వ్యాధులు, ఇతర పలు అంశాలను కూడా ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.
గతంలో ఈ సీజనల్‌లో అంటు వ్యాధులు ప్రబలి అనేక మంది మరణించేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అయితే, వర్షాలు ఆలస్యంగా అనూహ్యంగా కురుస్తుండటంతో స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా జ్వరాలు కాస్త ఎక్కువైన మాట నిజమేనన్నారు. వాటిని అదుపు చేస్తున్నామని, తగిన పరీక్షలు, మందులు సంసిద్ధంగా ఉంచుకున్నామని మంత్రి వివరించారు. అయితే, వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత వర్షాలు తగ్గినే మరింతగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. అందుకే వివిధ శాఖలతోనూ సమన్వయంతో
పని చేయాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆయుష్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆయుష్ వైద్య సేవలను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నది వైద్య ఆరోగ్యశాఖ. ఇప్పటి వరకు ఆలోపతి సేవలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. అవి ఇప్పుడు వెయ్యికి పైగా చేరాయి. అయితే, ఆయుష్ విభాగంలోనూ 56 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలనే ఆలోచన జరుగుతున్నది. ఆయుష్ కింద ఆయుర్వేదం, యునానీ, హోమియో, ప్రకృతి చికిత్సలు వంటి విభాగాలున్నాయి. ఈ విభాగాలలోని మొత్తం 56 రకాల వైద్య సేవలను ఆరోగ్య శ్రీ కింద చేర్చే యోచనపై మంత్రి లక్ష్మారెడ్డి
సమీక్షించారు. అయితే, ఏయే విభాగం నుంచి ఏయే సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలి? ఆయా సేవల చేర్చడం అవసరం ఉందా? ఏ మేరకు వంటి అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తేవాల్సిందిగా అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు వివిధ వైద్యశాలలకు ఉన్న బకాయీలు, చెల్లింపుల విషయంతోపాటు ఇంకా ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీకి అందాల్సిన నిధుల మీద కూడా మంత్రి సమీక్షించారు.
ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్టుల హెల్త్ స్కీంల పనితీరు, ప్రగతి మీద కూడా సమీక్ష జరిగింది. కల్తీ లేని మోడల్ పట్టణాల తయారీ ఇదిలావుండగా, కల్తీల మీద కఠిన వైఖరి అవలంబించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్కో పట్టణంలో, నగరంలోనూ ఒక్కో వీధిని ఎంచుకుని, కల్తీలకు తావులేని సచ్చీలమైన వస్తువులు అందుబాటులో ఉండే వీధిగా మాడల్‌గా తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, చర్యలు కూడా వెంటనే ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. కల్తీల మీద కఠినంగా
వ్యవహరించాలని, దాడులను విస్తృతం చేయడం ద్వారా కల్తీని అరికట్టాలని మంత్రి సూచించారు.
ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ కంపా శంకర్ తదితరులు పాల్గొన్నారు.