ఆప్ గెలుపు కాదు.. చేజేతులా బీజేపీ ఓటమి

అన్నీ ఉండీ ఘోర పరాభవాన్ని కొని తెచ్చుకోవడంలో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ను మించి పోయింది. కేంద్రంలో అధికారం ఉంది. ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు జరపాలో నిర్ణయించే పవర్ చేతిలో ఉంది. ముందుగానే తేదీని తెలుసుకుని ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. అధికార పార్టీగా అర్థబలం ఉంది. బోలెడంత కేడర్ బలం ఉంది. ఇన్నీ ఢిల్లీలో పరువు పోగొట్టుకుంది.

గత మే నెలలో లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, జులై లేదా ఆగస్టులో ఢిల్లీ ఎన్నికలు నిర్వహిస్తే కమలం క్లీన్ స్వీప్ చేసేది. ఆనాడు మోడీ హవా జోరు మీదుంది. ఓటమి భారంతో కేజ్రీవాల్ ఇంట్లో కూర్చుకున్నారు. ఆప్ డీలా పడి ఉంది. కానీ బీజేపీ, కేంద్రం ఆ నిర్ణయం తీసుకోలేదు. ఎంత సేపూ ఇతర పార్టీల వారిని గుంజుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగలమా అనే దానిమీదే ఢిల్లీ బీజేపీ నేతలు ఫోకస్ చేసి ఫెయిలయ్యారు.

కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిని చేయడం అనేది హడావుడిగా ఆగమేఘాల మీద జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కళ్లు మూసి తెరిచే లోగా ఆమె పార్టీలో చేరడం, సీఎం అభ్యర్థి కావడం చక చకా జరిగిపోయాయి. కనీసం కార్యకర్తలకు పరిచయం చేయడం గానీ, ఆమె అందరిలో ఒకరిగా మమేకం కావడం గానీ జరగలేదు. కనీసం మూడు నాలుగు నెలల ముందు ఆమె పార్టీలో చేరి, రాజకీయ నాయకురాలిగా రూపాంతరం చెందిన తర్వాత సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సింది.

కనీసం ఓ మేనిఫెస్టో కూడా విడుదల చేయనంత అతి విశ్వాసం కూడా బీజేపీని దెబ్బ తీసింది. ఏం చేసినా జనం ఓటేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీని చావుదెబ్బ కొట్టింది. విజన్ డాక్యుమెంటుతో సరిపెట్టడం, దానిపైనా వివాదం చెలరేగడం బీజేపీ వంటి జాతీయ పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చి పెట్టింది.

ప్రచారంలో పాజిటివ్ అంశాల కంటే కేజ్రీవాల్ ను తిట్టడమే ఎక్కువైంది. నెగెటివ్ ప్రచారం అతి అయితే వికటిస్తుందని బీజేపీ గుర్తించలేదు. నిజంగానే వికటించింది.

బీజేపీ సభలు హంగూ ఆర్భాటంగా సాగాయి. చివరికి మోడీ 10 లక్షల సూట్ కూడా చర్చనీయాంశమైంది. రిపబ్లిక్ డే పరేడ్ కు మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఆహ్వానం పంపని వారు, ఏ హోదాలో కిరణ్ బేడీని ఆహ్వానించారు? దాని వల్ల ఏం ఒరిగింది? బీజేపీకి అధికార మదం ఎక్కువైందని జనం అనుకోవడానికి కారణమైంది.

ఇలా బీజేపీ తప్పు మీద తప్పు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని పళ్లెంలో పెట్గి అప్పగించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *