ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్, ప్రతినిధి  : ఎలాగైనా జమ్మూ కాశ్మీర్ లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ..ముఖ్యమంత్రి పీఠంపై పీడీపీ కూడా కన్నేసింది. ఎవరికి వారే నేతలు రాజకీయాలు చేస్తుండడంతో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ మెంట్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు షాకులిస్తూ ‘ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్’ తెరలేపుతున్నారు. మహారాష్ట్రలో ఆడిన ఆటనే కాశ్మీర్ లోనూ ఆడాలని చూస్తున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఒమర్..
28 స్థానాలు గెలుచుకుని ముందు వరుసలో ఉన్న పీడీపీ సీఎం సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే పీడీపీకి చెక్ పెట్టేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కమలంతో దోస్తి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కూడా ఎన్సీ మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకే వచ్చాయంటున్న జైట్లీ..
మరోవైపు బీజేపీ లీడర్లు మాత్రం జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీనే ఆదరించారని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకే వచ్చాయని జైట్లీ గుర్తు చేశారు. అక్కడ సౌభ్రాతృత్వం, అభివృద్ధి, ప్రాంతీయ సమగ్రత అంశాలపై దృష్టి పెడుతామని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌పై తమ పార్టీ అధ్యక్షుడికి అన్ని వివరాలు అందించామని, త్వరలోనే తమ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయం తీసుకుంటారని జైట్లీ తెలిపారు.

నేషనల్ కాన్ఫరెన్స్ – బీజేపీ పొత్తు కుదురుతుందా ?
జమ్మూ కాశ్మీర్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు మొగ్గతొడుగుతున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బయటికి మాత్రం రెండు పార్టీల నేతలు అలాంటిదేమీ లేదంటున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత ఒమర్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, పీడీపీలే ప్రయత్నించాయని అన్నారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లు పీడీపీ సంకేతాలు ఇచ్చింది. గతంలో బీజేపీ, పీడీపీ మధ్య మైత్రీ ఉంది. దీంతో హస్తిన వేదికగానే చక్రం తిప్పేందుకు ఒమర్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

పీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అదే నేషనల్‌ కాన్ఫరెన్స్ తో పొత్తుపెట్టుకుంటే బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్సీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేంద్రంలో ఒక మంత్రిపదవి, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.