Breaking News

ఆకుపచ్చని తెలంగాణ కోసం…

harithaharam

తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా మార్చే అవకాశం ఈ గడ్డమీద పుట్టిన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నీటి నిల్వకు తగిన విధంగా తయారవుతున్నాయి. వాననీటిని ఒడిసిపట్టి పొలంబాట పట్టించే మార్గమది. మరోవైపు, తెలంగాణకు హరిత హారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహత్తరమైన కార్యక్రమం, ఆ చెరువులను నింపే వానలు దండిగా కురిపించడానికి. అడవులుంటేనే వర్షాలు కురుస్తాయి. లేకపోతే అంతా అనర్థమే.

ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత హారం పథకాన్ని చేపట్టారు. చిల్కూరు బాలాజీ సమక్షంలో శ్రీకారం చుట్టారు. తెలంగాణ వ్యాప్తంగా కనీసం 40 కోట్ల మొక్కలను నాటాలనే సంకల్పించారు. ఊరూరా ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం పెరిగితే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అప్పుడు కరువు కాటకాలుండవు. వానకోసం రైతన్న ఆకాశం దిక్కు చూడాల్సిన అసవరం ఉండదు. ఇంతకాలం వాన కురిస్తే ఆ నీరు ఉపయోపడేది కాదు. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల బాగుపడ్డాయి. పూడిక తీత జరుగుతోంది. కాబట్టి దండిగా నీరు నిల్వ ఉంటది.

పది జిల్లాలూ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేపట్టిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచీ సానుకూల స్పందన లభిస్తోంది. బడిపిల్లలు మేమే సైతం అంటూ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ మహానగర ఒకప్పుడు చల్లగా ఉండేది. ఇప్పుడు చెట్ల స్థానంలో బడా భవంతులు లేచి భరింతలేని వేడి ప్రాంతంగా మారింది. నగరంలో విరివిగా మొక్కలు నాటితే మళ్లీ ఈ నగరం పచ్చగా వెలుగొందడమే కాదు, ఎండా కాలంలో కూడా ఫ్యాన్ వేసుకోకుండా హాయిగా ఇంట్లో ఉండేవిధంగా తయారవుతుంది. ఇంటి ముందు చెట్టుంటే ఇంకేం కావాలి?

అయితే మొక్కలను నాటగానే సరిపోదు. స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాయి. నాటిన మొక్కలు నామరూపాల్లేకుండా పోయిన సందర్భాలే ఎక్కువ. అందుకే, రాష్ట్రంలో, దేశంలో కరువుకాటకాలు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడి ఏపుగా పెరిగేలా చేస్తే రేపటి రోజు వానకు, నీటికి, తిండికీ లోటుండదు. హరిత హారం మన కోసం. జనం కోసం. ఆకుపచ్చ తెలంగాణ కోసం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *