అస్సాంలో మిలిటెంట్ల ఘాతుకం

దీస్పూర్, ప్రతినిధి: అసోంలో ఏకే-47ల మోత మోగింది. అమాయక గిరిజన ప్రజలే లక్ష్యంగా బోడో మిలిటెంట్లు తెగబడ్డారు. కోక్రాఝర్‌ జిల్లాలోని సెర్ఫాన్‌గురి, ఉల్టాపానీ, సోనిట్‌పూర్‌ జిల్లాలోని బాటసిపూర్‌ గ్రామాలపై విరుచుకుపడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు అని చూడకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అసోం వెళ్లనున్నారు. మిలిటెంట్ల దాడిలో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పాశవికంగా మిలిటెంట్ల కాల్పులు
కోక్రాఝర్‌, సోనిట్‌పూర్‌ జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు తేయాకు తోటల్లో పనులు చేసి పొట్టపోసుకుంటుంటారు. వీరిపై మిలిటెంట్లు పాశవికంగా కాల్పులు జరిపి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. మిలిటెంట్లు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం ఇద్దరు మిలిటెంట్లను భద్రతాదళాలు కాల్చి చంపాయి. ఇందుకు ప్రతీకారంగానే కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మిలిటెంట్ల దాడిని పలు స్టూడెంట్‌ యూనియన్లు ఖండించాయి. మరోవైపు ప్రభుత్వం అసోంలో రెడ్‌ అలెర్ట్ ను ప్రకటించింది. భారత- భూటాన్‌ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. కోక్రాఝర్‌, బక్సా, ఉదల్‌గురి, చిరాంగ్‌ ప్రాంతాల్లో మిలిటెంట్ల కోసం భద్రతాదళాలు జల్లెడపడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.