
అమరావతి (పిఎఫ్ ప్రతినిధి): అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణలో విజయం సాధించినప్పటికీ రాజధానికి సంబంధించిన ప్యాకేజీలు కానీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల విషయాలలో నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ వస్తున్నారు నూతన రాజధానికై వరాలజల్లు కురిపిస్తారనుకున్న ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విభజన చట్టంలో మాదిరిగానే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మోడీ తెలపడంతో ప్రత్యేక హోదా విషయంలో ఎపి ప్రజలు ఖంగుతిన్నారు. రాజధాని గురించి ఢిల్లీ నుంచి మట్టి, నీరు తెచ్చి జనాల నోట్లో మట్టి కొట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహామహులు హాజరైన వేదికపై ప్రత్యేక హోదా గురించి ఏపి ముఖ్యమంత్రి బాబు ప్రధాని ముందుంచినప్పటికీ ప్రత్యేక హోదాపై ప్రధాని మాట్లాడకపోవడంపై పలు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.