
కరీంనగర్: 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ అన్నారు. సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేటు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు
అని దీనిని సరిగా వినియోగించుకోవాలని అన్నారు. ఓటరుగా ఒక చోట నమోదు చేసుకోవాలని సూచించారు. నీతి నిజాయితితో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లలో అవగాహన పెంపొందించి మార్పులు రావాలని అప్పుడే పటిష్టమైన ప్రజాస్దామ్య వ్యవస్ధ ఏర్పడి దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు పోతుందని అన్నారు.
జిల్లాలో 3 లక్షల తప్పుడు, డబుల్ ఓట్లను తొలగించుట అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చుటకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా పెద్దదని కచ్చితమైన ఓటర్ల జాబితాలో దేశం ముందుకు వెళ్తుందని అన్నారు.
జిల్లాలో ఓటర్ల జాబితాను తప్పులు లేకుండ, డబుల్ ఓటర్లు లేకుండా తయారు చేశామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటిదని ప్రతి ఎన్నికల్లో నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. యువతి, యువకులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించేందకు భారత జాతీయ ఎన్నికల
సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పి జోయల్ డెవిస్ మాట్లాడుతూ కులం, మతం, జాతి ఎలాంటి లింగ బేదం లేకుండా 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు సరిగా వినియోగించుకోవాలని సూచించారు. 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని, 10 మందికి అవగాహన కల్పించాలని ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా 1950 నుంచి మన దేశంలో ఓటు హక్కు వినియోగం అమలులోకి వచ్చిన నుండి ఓటు హక్కు వినియోగించుకొంటున్న సీనియర్ సిటిజెన్స్ జమాలోద్దీన్, జక్కుల శాంతమ్మ, మల్లమ్మ, తదితరులను ముఖ్య అతిధులు సన్మానించారు. అలాగే 18 సం.లు నిండి కొత్తగా ఓటరుగా నమోదైన వారికి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస, వకృత్వ, వ్యాసరచన, ముగ్గుల పోటీలను గెలుపొందిన వారికి ముఖ్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అదనపు జెసి. డా. నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, ఆర్.డి.ఓ. చంద్రశేఖర్, డి ఎస్పి రామారావు తదితరులు పాల్గొన్నారు.