
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అర్చకులు, ఆలయ ఉద్యోగుల గౌరవం మరింత పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్చక, ఆలయ ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రప్రభుత్వం అర్చకుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచడంతో పాటు ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయలోని మంత్రి చాంబర్ లో రాష్ట్ర ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భేతి రంగారెడ్డి నేతృత్వంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి పుష్ఫగుచ్చం అందజేశారు. అర్చక, ఉద్యోగుల సంఘం నేతలు గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వం కూడా అర్చకులు, ఆలయ ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భేతి రంగారెడ్డి, జయపాల్ రెడ్డి, ఆనంద్ శర్మ,శ్యాం సుందర్, డిఎఆర్.శర్మ, రవీంద్ర చారి, శ్రీను, ప్రభాకర్, వీరభద్ర శర్మ, తదితరులు ఉన్నారు.