అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్టు అవార్డులు-2017

ప్రముఖ పాత్రికేయుడు, కవి, కాలమిస్టు అరుణ్ సాగర్  పేరిట ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ఎంట్రీలను డిసెంబర్ 8వ తేదీ లోగ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.

బుధవారంనాడు మీడియా అకాడమీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ, టీవీ-5 సౌజన్యంతో మీడియా అకాడమీ ఈ అవార్డులను అందజేస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియారంగాల్లో ఆరుగురికి అవార్డులు అందించినట్టే.. ఈ ఏడాదికూడా అరుణ్ సాగర్   పేరిట అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే తెలుగు పాత్రికేయులు తమ ఎంట్రీలను డిసెంబర్ 8వ తేదీలోపు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయానికి పంపాలన్నారు.  2017 సంవత్సరంలో ప్రచురితమైన/ప్రసారమైన కథనాలు పరిశీలిస్తామని అన్నారు. సదరు కథనాలు సామాజిక అంశాలు, మానవీయ కోణాలను ప్రతిబింబించేవిగా ఉండాలని తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో రెండు ప్రథమ బహుమతులు, రెండు ద్వితీయ బహుమతులు, రెండు తృతీయ బహుమతులు ఉంటాయని వివరించారు. మొదటి బహుమతి కింద రూ.75వేలు నగదు, ద్వితీయ బహుమతి కింద రూ.50వేలు, తృతీయ బహుమతికింద రూ.25వేలు నగదుతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తామని తెలిపారు. ప్రచురితమైన కథనం సదరు రిపోర్టర్ బైలైన్తో ఉండాలని, లేనిపక్షంలో ఆ కథనాన్ని రాసింది సదరు విలేకరేనని ఎడిటర్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం జత చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో  సదరు రిపోర్టర్ దృశ్యకథనంలో ఉండాలని, ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ఒకటి లేదా రెండు ఎంట్రీలను మాత్రమే పంపాలన్నారు. అవార్డుల ఎంపికకు సాక్షి ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ కే. రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డిలు జ్యూరీగా వ్యవహరిస్తారని తెలిపారు.
అరుణ్ సాగర్ పుట్టిన రోజు సందర్భంగా 2018 జనవరి 2న తెలుగు యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రదానం ఉంటుందని, ఇదే కార్యక్రమం సందర్భంగా వర్తమాన పరిణామాలపై ప్రముఖ జాతీయస్థాయి జర్నలిస్టుతో గెస్ట్ లెక్చర్ ఉంటుందని తెలిపారు.
అరుణ్ సాగర్  జీవిత విశేషాలను వివరిస్తూ, సుప్రభాతం పత్రికతో ప్రారంభమైన అరుణ్ సాగర్  పాత్రికేయ జీవితం.. ఆంధ్రజ్యోతి పత్రికతో రాటుదేలిందని, అనంతరం వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పాతికేళ్లపాటు విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. టీవీ9 తొలి పాత్రికేయ బృందంలో కీలకంగా వ్యవహరించిన అరుణ్ సాగర్  అనంతరం 10టీవీ వ్యవస్థాపక సీఈవోగా పనిచేశారన్నారు. టీవీ5లో ఎడిటర్ గా  పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మృతిచెందినట్లు వివరించారు. అద్భుత రచనాశైలిని సొంతం చేసుకున్న అరుణ్ సాగర్..ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నప్పటికీ.. నిత్యం వివిధ పత్రికల్లో సమకాలీన, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై అనేక వ్యాసాలు, కవితలు రాశారన్నారు. తనకంటూ ప్రత్యేక రచనాశైలిని ఏర్పర్చుకున్న అరుణ్ సాగర్ .. మేల్కొలుపు, మియర్మేల్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలను వెలువరించినట్లు తెలిపారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు పోలవరం నిర్వాసితుల ఆవేదనలను ‘మ్యూజిక్ డైస్’ పేరుతో కవిత్వీకరించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, చాపెల్ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్-500001 చిరునామాకు పంపాలని సూచించారు. ఇతర వివరకు ఫోన్ నెం. 040-23298672 ను సంప్రదించాలని అయన తెలిపారు.

ఈ సమావేశంలో మీడియా అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, అవార్డుల కార్య నిర్వాహుకులు జగన్, రాజ్ కుమార్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *