
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 :30 గంటలకు కన్నుమాశారు. ఆసుపత్రి వైద్యులు ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించడంతో రాష్ట్రప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. గత సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత దాదాపు రెండు నెలల చికిత్స అనంతరం ఇటీవల కొంత కోలుకున్నారు. అభిమానుల ప్రార్థనలతోనే తాను పునర్జన్మ ఎత్తానని, త్వరలోనే తిరిగి వచ్చి ప్రజాసేవకు పునరంకితమవుతానని జయలలిత ప్రకటించారు. అపోలో వైద్యులు సైతం అమ్మకు పూర్తి స్వస్థత చేకూరిందని, ఆమె ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ఇంటికి వెళ్లవచ్చని ఇటీవల ప్రకటించారు. ‘అమ్మ’ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సైతం ఆదివారం ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన కొద్ది సమయానికే ఎవరూ ఊహించని విధంగా జయలలిత గుండెపోటుకు గురవడంతో మరోసారి తమిళనాట ఉద్విగ్న పరిస్థితులు తలెత్తాయి. క్రిటికల్ కేర్ నిపుణులు సంహా వైద్యనిపుణుల బృందం వెంటనే ఆమెను ఐసీయూకు తరలించి పూర్తి సామర్థ్యంతో వైద్య చికిత్స అందించింది. గుండెకు దన్నుగాఉండే పరికరం సాయంతో అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు. అమ్మ ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో అభిమానులు పెద్దఎత్తున అపోలోకు తరలిరావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆమె కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. అయితే తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్టు జయలలిత చికిత్స పొందుతూనే తన అశేషాభిమానులకు సుదీర్ఘ వీడ్కోలు పలికారు. తిరిగిరాని లోకానికి తరలిపోయారు. 68 ఏళ్ల జయలలిత రికార్డు స్థాయిలో ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి…పురట్టితలైవి (విప్లవనాయకురాలు)గా, అమ్మగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చివరివరకూ అవివాహితగానే ఆమె జీవితాన్ని గడిపారు. తన రాజకీయ వారసులుగా పన్నీరు సెల్వం ను ప్రకటించారు.