అమీర్‌పేట్ మైత్రివ‌నంలో అక్ర‌మ ఫ్లెక్సీలు, బోర్డుల తొల‌గింపు

అమీర్‌పేట్ మైత్రివ‌నంలో అక్ర‌మ ఫ్లెక్సీలు, బోర్డుల తొల‌గింపుపై బ‌ల్దియా స్పెషల్ డ్రైవ్‌
20 వేల బ్యాన‌ర్లు, బోర్డుల తొల‌గింపు – జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ

ప్రెస్‌నోట్‌: 3 ఖైర‌తాబాద్ స‌ర్కిల్‌లోని అమీర్‌పేట్ మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న ప‌లు కోచింగ్ సంస్థ‌లు, కంప్యూట‌ర్ ఇనిస్టిట్యూట్‌లు ప్ర‌మాద‌క‌రంగా ఏర్పాటు చేసిన వేలాది బ్యాన‌ర్లు, నేమ్ బోర్డులు, హోర్డింగ్‌ల‌ను తొల‌గించే ప్ర‌త్యేక డ్రైవ్‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ ఆధ్వ‌ర్యంలో జోన్‌లోని ఐదుగురు డిప్యూటి క‌మిష‌న‌ర్లు, కార్య‌నిర్వాహ‌క ఇంజ‌నీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లాన‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు ఇత‌ర అధికారుల‌తో కూడిన 30 బృందాలు మంగ‌ళ‌వారం ఉద‌యం నుండి మైత్రివ‌నంలో అక్ర‌మ బ్యాన‌ర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల‌ను తొల‌గించడం ప్రారంభించారు. ఒక్కో బృందంలో జెసిబి, ల్యాడ‌ర్‌, హోర్డింగ్‌ల తొల‌గింపుకు త‌గు ప‌రిక‌రాల‌తో కూడిన సిబ్బంది ఉన్నారు. మైత్రివ‌నంలోని ప‌లు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్లో ప్ర‌మాద‌క‌రంగా ఉన్న బోర్డులను తొల‌గించుకోవాల‌ని, అగ్నిప్ర‌మాద నివార‌ణ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు గ‌తంలోనే నోటీసులు జారీచేశారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ స్వ‌యంగా అమీర్‌పేట్‌లోని ప‌లు భ‌వ‌నాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఇటీవ‌ల సూర‌త్‌లోని కోచింగ్ సెంట‌ర్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో పలువురు విద్యార్థులు మ‌ర‌ణించిన నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేసిన కోచింగ్ సెంట‌ర్ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని బ‌ల్దియా నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా నేడు దాదాపు 200మందితో కూడిన ఐదు బృందాలు మైత్రివ‌నం ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు 20వేల బ్యాన‌ర్లు, బోర్డులు, ఫ్లెక్సీల‌ను తొల‌గించాయ‌ని ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ తెలిపారు. ఈ అమీర్‌పేట్ మైత్రివ‌నం ధ‌రంక‌రంరోడ్ త‌దిత‌ర ప్రాంతాల్లో విచ్చ‌ల‌విడిగా బ్యాన‌ర్లు, బోర్డుల‌ను ఏర్పాటు చేశార‌ని, వీటిలో నేడు కేవ‌లం 40శాతం మాత్ర‌మే తొల‌గించామ‌ని, ఈ ప్ర‌త్యేక డ్రైవ్ రేపు కూడా కొన‌సాగుతుంద‌ని ముషార‌ఫ్ అలీ స్ప‌ష్టం చేశారు. కాగా తాము శిక్ష‌ణ పొందే కోచింగ్ సెంట‌ర్ల‌లో అగ్నిమాప‌క ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ఉన్నాయా? లేవా అని చెక్ చేసుకోవాల‌ని విద్యార్థినీవిద్యార్థుల‌కు ముషార‌ఫ్ అలీ విజ్ఞ‌ప్తి చేశారు.

mytrivanam 1     mytri vanam 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *