
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే మహాకూటమి ఏర్పాటు చేశారని తాజా మాజీ ఎమ్మెల్యే, పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గుడికుంట తండా, దర్ధపల్లి, గూడూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్రతిపక్షాల నాయకులు ఒక్కటయ్యారని, ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మహాకూటమికి ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనన్నారు. టీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి కల్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయల అందజేస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఆయా వర్గాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. అనుకోకుండా రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందజేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలన్నారు. అంతకుముందు పార్టీలో చేరిన వారిలో బానోతు రకుల్, ఎంపీటీసీ యాకుబ్ ఆధ్వర్యంలో బానోతు లక్ష్మన్, కోసల్యా, జోగియ, గౌరమ్మ, విజయ, యాకు, జలగం మధు కాంగ్రెస్ బూత్ కన్వీనర్, జలగం అంజయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సోమయ్య, రమేష్, కుమార్, చిన్న కృష్ణ, మహేందర్, బలవేని సోమయ్య ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు, నర్సయ్య, వెంకన్న, వెంకీ ముదిరాజ్ యూత్ కోశాధికారి, తొడుసు భిక్షపతి కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు, బెల్లి మహేందర్, బెల్లి నవీన్, సోమయ్య, ప్రవీణ్ ఉన్నారు.