
పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహాకూటమి పేరుతో వచ్చే నాయకులను నమ్మొద్దని, నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధికే ఓటు వేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు, కోలాటం ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అనైతిక పొత్తులు పెట్టుకున్నారని, ఎన్నికల్లో వారి డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో అన్ని వర్గాల సంక్షేమనాకి పెద్దపీట వేశామని, అందులో భాగంగానే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని అన్నారు. అభివృద్ధి నిరోధకులకు, అభివృద్ధి ప్రదాతకు మధ్య జరుగుతున్నఎన్నికలని, ఓటుతో వారికి బుద్ది చెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ గెలుపుకోసం పని చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకండా దీక్ష చేశారని, అదే అంకుటిత భావంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.