అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు చేసే హాస్పిట‌ల్స్‌పై చ‌ర్య‌లు: మంత్రి లక్ష్మారెడ్డి

అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు చేసే హాస్పిట‌ల్స్‌పై చ‌ర్య‌లు

ఆ వైద్య‌శాల‌ల‌ను సీజ్ చేస్తాం

ప్ర‌తి నెలా శ‌స్త్ర చికిత్స‌ల నివేదిక‌లు పంపాల్సిందే

స‌ర్కార్ ద‌వాఖానాల్లోనే వంద శాతం ప్ర‌సూతిలు

పిహెచ్‌సిల‌ను ఆధునీక‌రించాం

అన్‌మోల్ యాప్‌తో మెరుగైన సేవ‌లు 

ఎఎన్ఎంల‌కు ట్యాబ్‌లు పంపిణీ చేసిన‌ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 4,900 మంది ఎ ఎన్ ఎంల‌కు ట్యాబ్‌ల పంపిణీ

గ్రామాల్లో గ‌ర్బిణీలు, బాలింత‌లు, పిల్ల‌ల ఆరోగ్య వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్యాబ్‌ల ద్వారా అప్‌డేట్‌

హైద‌రాబాద్: అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు చేసే వైద్య‌శాల‌ల మీద క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. ఆయా వైద్య‌శాల‌ల‌ను సీజ్ చేస్తామ‌న్నారు. అలా ఇప్ప‌టికే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఒక హాస్పిట‌ల్‌ని సీజ్ చేశామ‌న్నారు. హాస్పిట‌ల్స్ లో చేసే ఆప‌రేష‌న్ల‌కు సంబంధించిన వివ‌రాలు ప్ర‌తి నెలా త‌ప్ప‌నిస‌రిగా పంపాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. ఎఎన్ఎంల‌కు ఆన్ లైన్ ట్యాబ్ బేస్డ్ యాప్‌ని మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్‌లో మంత్రి విడుద‌ల చేశారు. ట్యాబ్‌ల‌ని ఎఎన్ఎంల‌కు పంపిణీ చేశారు.

అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక చోట్ల అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు జ‌రుగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. ఇక నుంచి అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు, ఇత‌ర శ‌స్త్ర చికిత్స‌లు చేసే వైద్య‌శాల‌ల మీద క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. అలాంటి వైద్య‌శాల‌ల‌ను సీజ్ చేస్తామ‌న్నారు. ఈ మ‌ధ్యే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఒక హాస్పిట‌ల్‌ని సీజ్ చేశామ‌ని వివ‌రించారు. ఇలాంటి అన‌వ‌స‌ర సిజేరియ‌న్లు, హిస్ట్రెక్ట‌మీ లాంటి ఆప‌రేష‌న్ల‌ను నిలువ‌రించేందుకే ప్ర‌తి నెలా ఆప‌రేష‌న్ల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికిఅంద‌చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. శ‌స్త్ర చికిత్స‌ల ప్రోటోకాల్ ఉంటుంద‌ని, ఆ వివ‌రాల ద్వారా అవ‌న‌స‌ర ఆప‌రేష‌న్ల‌ని గుర్తించొచ్చ‌న్నారు. శ‌స్త్ర చికిత్స‌ల వివ‌రాలు పంప‌ని హాస్పిట‌ల్స్ మీద కూడా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను అభివృద్ధి ప‌ర‌చి ఆధునీక‌రించామ‌ని చెప్పారు మంత్రి. కొత్త ఫ‌ర్నీచ‌ర్‌, మంచాలు, బెడ్ షీట్స్‌, వైద్య, ప‌రీక్ష ప‌రిక‌రాలు అందించామ‌న్నారు. అలాగే ప్ర‌సూతి కేంద్రాల‌ను సైతం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏర్పాటు చేశామ‌న్నారు. ఇక వంద శాతం ప్ర‌సూతిలు ప్ర‌భుత్వ ప్ర‌సూతి కేంద్రాల్లోనే జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి వైద్ ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు చెప్పారు. 

అన్‌మోల్‌….ఎఎన్ఎం ఆన్ లైన్ అనే ట్యాబ్‌ బేస్డ్ (ఫోన్ ట్యాబ్‌) అప్లికేష‌న్‌ని వైద్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆవిష్క‌రించారు. ఎఎన్ఎం ఆన్ లైన్ ద్వారా ఎఎన్ఎం లు వైద్య ఆరోగ్య సేవ‌లు అందించిన వెంట‌నే దానికి సంబంధించిన వివ‌రాలు, స‌మాచారాన్ని ట్యాబ్‌లో పొందుప‌రుస్తారని చెప్పారు. ట్యాబ్‌ నుంచి ఈ స‌మాచారం స‌ర్వ‌ర్‌కి చేరుతుందని, అలాగే ఆ స‌మాచారం మానిట‌రింగ్ చేసే అధికారులంద‌రికీ ఒకే స‌మ‌యంలో చేరుతుందన్నారు. ఒక ఎఎన్ఎం 3 వేల నుంచి 5వేల జ‌నాభాకు సేవ‌లు అందిస్తున్న‌దని, ప్ర‌స్తుతం ఎఎన్ఎంలు మ్యానువ‌ల్‌గా త‌మకు కేటాయించిన రిజిస్ట‌ర్ల‌లో స‌మాచారాన్ని పొందుప‌ర‌చి, భ‌ద్ర‌ప‌రుస్తున్నారు, ఇలా మొత్తం 96 కాల‌మ్స్ నింపాల్సి వస్తుంద‌ని, నెలాఖ‌రులో ఈ స‌మాచారాన్ని కంప్యూట‌ర్ల‌లో పొందుప‌ర‌చేవారన్నారు. తాజా యాప్ తో ఎఎన్ఎంల‌కు రిజిస్ట‌ర్ల‌లో రాసే, మ‌రియూ కంప్యూట‌ర్ల‌లో నెల‌కోసారి పొందుప‌రిచే ప‌ని త‌గ్గుతుంది. నేరుగా ట్యాబ్‌ల్లోనే స‌మాచారం పొందుప‌ర‌చ‌డం ద్వారా ఖ‌చ్చిత‌మైన సేవ‌లు అందించ‌గ‌లుగుతారని మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. ఈ యాప్ ద్వారా రియ‌ల్ టైమ్‌లో స‌మాచారం, సంబంధిత అధికారులంద‌రికీ ఒకేసారి చేరుతుంది. దీంతో మానిట‌రింగ్ కూడా మెరుగు ప‌డుతుందన్నారు. ఈ ట్యాబ్‌ల‌లో గ‌ర్బిణీలు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఆరోగ్య సంబంధిత వీడియోలు కూడా పొందుప‌రిచే వీలుంద‌న్నారు. గ‌ర్బిణీలు, బాలింత‌లు, పిల్ల‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డం సాధ్య‌మ‌వుతుందని మంత్రి చెప్పారు. 

యాప్ గురించి వివ‌రిస్తూ,  తెలంగాణ‌లో 4,900 మంది ఎఎన్ఎంల‌కు ట్యాబ్‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుందని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. ఈ యాప్‌పై, అలాగే ట్యాబ్‌ వినియోగంలో పూర్తి స్థాయి శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు 27-02- 2017 నుంచి ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో మొద‌లయ్యాయ‌న్నారు. ఎఎన్ఎంల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆరుగురు అధికారుల‌ను రాష్ట్రానికి నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ అన్‌మోల్ ప్ర‌స్తుతం దేశంలో అమ‌లు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోది. ఇంత‌కు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాలు అన్‌మోల్ యాప్‌ని వినియోగిస్తున్నాయని చెప్పారు. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌థ‌కం న‌డుస్తుంద‌న్నారు.

ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేకపోయిన‌ప్ప‌టికీ ఆఫ్ లైన్‌లోనూ ఈ యాప్ ప‌ని చేస్తుందని, ఈ విధంగా ఇందులోని సాఫ్ట్ వేర్‌ని రూపొందించ‌డం జ‌రిగిందని చెప్పారు. ఇంట‌ర్నెట్ అందుబాటులోకి రాగానే ఆటోమెటిక్‌గా ట్యాబ్‌లో పొందుప‌ర‌చిన స‌మాచారం నేరుగా స‌ర్వ‌ర్‌లోకి వెళ్ళిపోతుందని, భ‌ద్ర‌మ‌వుతుందని, లోత‌ట్టు ఏజెన్సీ, గ్రామాల‌కు ఈ స‌దుపాయం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌లువురు ఎఎన్ఎంల‌కు ట్యాబ్‌ల‌ని పంపిణీ చేశారు. మంత్రి ల‌క్ష్మారెడ్డితోపాటు ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *