అన్ని విద్యాలయాల్లో ఒకే మెను, వసతులుండాలి : కడియం శ్రీహరి

 

  • అత్యుత్తమ భోజనం, వసతులు గురుకుల, కేజీబీవి, మోడల్ స్కూళ్ల విద్యార్థులకు కల్పించాలి
  • విద్యార్థులందరికీ ఒకేరకమైన కాస్మెటిక్ కిట్ లు అందించాలి
  • వచ్చే ఏడాది నుంచి కేజీబీవీలకు అకాడమిక్ బ్లాక్ నిర్మించాలని ఆలోచన చేస్తున్నాం
  • చలికాలంలో ఈ ఏడాది నుంచి స్నానానికి వేడినీళ్ల ఏర్పాట్లు

 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఒకేరకమైన భోజన వసతులు(మెను), మౌలిక వసతులు( అమెనిటీస్) కల్పించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కావల్సిన నిధుల కోసం వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒకే రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో వివిధ రకాల పద్దతులుండడం వల్ల పిల్లల్లో బేధభావాలు ఏర్పడే అవకాశం ఉందని, అందరికీ సమానమైన అవకాశాలు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల అధికారులతో సచివాలయంలోని మూడో అంతస్తులోని ఫైనాన్స్ కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, మైనారిటీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్,  గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, విద్యాశాఖ సంచాలకులు కిషన్ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంచాలకులు భట్టు మల్లయ్య,  కేజీబీవీల అదనపు సంచాలకులు శ్రీహరి, మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి మెను విద్యార్థులకు అందిస్తున్నారని, అదేవిధంగా వసతులు కూడా బాగున్నాయని, ఇదే మెను, వసతులు మిగిలిన సొసైటీల్లోని విద్యార్థులకు కూడా అందించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మెను, వసతులు కల్పించడానికి ఏవైనా గ్యాప్స్ ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని సొసైటీల కింద ఉన్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ట్రాక్ సూట్స్, బ్లాక్ షూస్, బెల్ట్, మ్యాట్రసెస్, యూనిఫామ్ లు, టవల్స్, బెడ్ షీట్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

తక్కువ మంది విద్యార్థులుంటే…ఎక్కువ మంది విద్యార్థులన్నట్లు చూపే విధానాన్ని పూర్తిగా స్వస్తిపలికే విధంగా ప్రతిరోజు ఆన్ లైన్ లో హాజరునమోదు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దీనివల్ల ఏ రోజు ఎంతమంది విద్యార్థులున్నారని తెలుస్తుందని, తర్వాత దీనిని మార్చడానికి కూడా వీలు లేకుండా లాక్ అవుతుందని వివరించారు. దీనివల్ల విద్యార్థుల నమోదులో ఎలాంటి అవకతవకలకు అవకాశమే లేదన్నారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యుత్తమైన విధానాన్ని అవలంభిస్తున్నామని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు జారీ చేశామని, ఈ కమాండ్ సెంటర్ లో ఆన్ కాల్ లో డాక్టర్లను అందుబాటులో ఉంచుకుంటున్నామని తెలిపారు. విద్యార్థి అస్వస్థతకు గురైతే ఆ విద్యార్థి మళ్లీ కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, పెద్ద, పెద్ద శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తున్నామని చెప్పారు. ఈ విధానం బాగుందని, వెంటనే దీనిని మిగిలిన అన్ని విద్యాసంస్థలకు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు.

ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులున్నాయని, కేజీబీవీలలో వచ్చే ఏడాది నుంచి అకాడమిక్ బ్లాకులు నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. గత రెండేళ్లలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో బయో మెట్రిక్ మెషీన్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, డ్యుయల్ డెస్క్ లు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్లు, ప్రాక్టికల్ ల్యాబ్ లు, ఫర్నిచర్, విద్యార్థులకు దుప్పట్లు ఇచ్చామన్నారు. గతం కంటే చాలా వరకు వసతులు పెంపొందించామని చెప్పారు. ఈ మూడు నెలలు చలికాలం ఉన్నందున వేడినీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, ఇద్దరు తల్లిదండ్రులు లేనివారు, కుటుంబం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విద్యార్థినిలు, అత్యంత పేదరికం నుంచి వచ్చిన బాలికలే ఈ మోడల్ స్కూళ్లు, కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో ఉంటున్నారని, వీరికి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అందించడం మన కనీస బాధ్యతని, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అందే మెను, వసతులు వీరికి కూడా అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *