
ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పులులు,వన్యప్రాణుల జనగణన
అటవీ శాఖ సన్నద్దత, మానవ వనరులు, ఏర్పాట్లపై సమీక్ష
హరితహారం నర్సరీలు, మొక్కల రక్షణకు ప్రాధాన్యత, నిర్లక్ష్యం ఉంటే చర్యలు
అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ
జిల్లాకు కనీసం ఒక్క కొత్త అర్బన్ పార్కు ఏర్పాటు దిశగా చర్యలు
అన్ని జిల్లాల అటవీ అధికారులతో ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్
ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా పులులు, వన్యప్రాణుల జనగణన మొదలవుతోందని, తెలంగాణలో కూడా ఈ సర్వేను చేపడుతున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పి.కె.ఝా వెల్లడించారు. అడవులు, వణ్యప్రాణుల రక్షణతోనే పర్యవరణ సమతుల్యత ఆధారపడి ఉందని, అందుకే నాలుగేళ్ల కోసారి ఈ రకమైన సర్వేను కేంద్రం నిర్వహిస్తోందని, తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి సారి పులుల లెక్కింపు జరుగుతోందని వెల్లడించారు. సర్వేకు అటవీ శాఖ సన్నద్దత, మానవ వనరులు, సాంకేతిక సౌకర్యాలపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల అటవీ అధికారులతో ఉన్నతాధికారులు సమీక్షించారు. సిబ్బంది కొరత ఉన్నచోట ఔత్సాహికులు, విద్యార్థులు, వాలంటీర్ల సహకారం తీసుకోవాలని తెలిపారు. నైపుణ్యం ఉన్న అటవీ అధికారి పర్యవేక్షణలో సర్వే కొనసాగించాలని సూచించారు.
హరితహారంలో భాగంగా ఈ యేడు నాటిన మొక్కల రక్షణ చర్యలపై సమీక్షించారు. మొక్కల బతికే శాతం పెంపు, తీసుకుంటున్న చర్యలపై జిల్లాల వారీగా ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం సమీక్షిస్తోందని వెల్లడించారు. నర్సరీల నిర్వహణలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని, వచ్చే యేడాది హరితహారం కోసం పెద్ద మొక్కలు పెంచాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణలో వైఫల్యం ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని పీసీసీఎఫ్ తెలిపారు. రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ తో అటవీ శాఖకు మంచి గుర్తింపు వస్తోందని, దీనిని మరింతగా చేపట్టాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల తో సమన్వయం చేసుకుని, పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, ప్రధాన రోడ్ల వెంట జిల్లాకు వంద కిలోమీటర్లకు తక్కువ కాకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని చెప్పారు. ఇక అర్బన్ పార్కుల ఏర్పాటుకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అన్ని జిల్లాల్లో కనీసం ఒకటి చొప్పన కొత్త అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, పట్టణ ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే అటవీ బ్లాకుల్లో ఈ పార్కులను ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
అటవీ, గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు, రోడ్డు, విద్యుత్ సదుపాయం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానిక అటవీ యంత్రాంగం పూర్తిగా సహకరించాలని కోరారు. అలాగే కొత్త యేడాదిని అగ్ని ప్రమాదాల నివారణ సంవత్సరంగా అటవీ శాఖ పాటిస్తోందని, కొత్తగా పచ్చదనం పెంచటం ఒక ఎత్తు అయితే, ఉన్న అడవిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. తెలంగాణలో సుమారు 440 గ్రామాలు అటవీ అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న వాటిగా గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యల ద్వారా ఈయేడు ప్రమాదాలను నివారించాలన్నారు. అటవీ ఉత్పత్తులు, బీడీ ఆకుల సేకరణ లాంటి వాటికోసం అడవికి నిప్పుపెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తప్పవన్న విషయాన్ని బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి నుంచి మే నెల ఆఖరుదాకా అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఉప గ్రహాల సహకారంతో అడవుల్లో అగ్ని ప్రమాదాల తక్షణం గుర్తించి, ఆర్పే చర్యలు తీసుకోవచ్చన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ లాంటి అభయారణ్యాల్లో అగ్ని ప్రమాదాల నివారణ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులకు సూచించారు. ఉద్దేశ్యపూర్వకంగా, నిర్లక్ష్యంగా అడవిలో అగ్నిప్రమాదాలకు కారణం అయ్యే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహించాలని ఆదేశించారు.
ఈ నెల పదిన ఐ.ఎఫ్.ఎస్, అటవీ అధికారుల కాళేశ్వరం పర్యటన
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈ నెల 10న అటవీ అధికారుల బృందం పర్యటించనుంది. సుమారు యాభై మంది అధికారులు హైదరాబాద్ నుంచి బయలుదేరి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పంపు హౌజ్ లు, టన్నెల్ , బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకం పనులను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. కాళేశ్వరం పరిధిలోకి వచ్చే పధ్నాలుగు అటవీ డివిజన్ల అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు.