
ముందుగా ఐదు జిల్లాల్లో ప్రారంభంమిగతా 5 జిల్లాలకు తాత్కాలికంగా క్యాన్సర్ కేర్ యూనిట్స్ తర్వాత స్క్రీనింగ్ సెంటర్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించింది ఎంఎన్‌జె (మహదీ నవాజ్ జంగ్) క్యాన్సర్ హాస్పిటల్ 9వ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే, క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పని చేయాలని ఆదేశించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఎంఎన్‌జె పాలక మండలి వైస్ చైర్మన్ డాక్టర్ సి లక్ష్మారెడ్డి.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వెంగళరావు నగర్‌లోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో ఎంఎన్‌జె 9వ పాలక మండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమాజంలో క్యాన్సర్ పరివ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. అందుకు తగ్గట్లుగా అన్ని జిల్లాల్లో ఎన్ సి డి (నేషనల్ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ) కింద క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, అన్ని జిల్లాల్లో ఒకేసారి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించడంలోని ఇబ్బందుల దృష్ట్యా, ముందుగా మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐదు జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆతర్వాత మిగతా నాలుగు జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభిస్తారు. అయితే, ఈ నాలుగు జిల్లాల్లో తాత్కాలికంగా క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మహిళల్లో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే సర్వైకల్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్ వ్యాధుల మీద కూడా దృష్టి పెట్టాలని సమావేశం నిర్ణయించింది.
ఇక హైదరాబాద్‌లోని ఎంఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ విస్తరణకు నడుం బిగించాలని సమావేశం నిర్ణయించింది. అధునాతన 500 పడకల నూతన భవన సముదాయానికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. నూతన భవన నిర్మాణం పూర్తయ్యేలోగా అదనపు, తగినంత స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరిగే విధంగా చూడాలని సమావేశంలో మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆర్థిక అనుమతులు వచ్చినందున మిగతా పనులు వేగవంతం చేయాలని మంత్రి ఎంఎన్ జె డైరెక్టర్ డాక్టర్ జయలతకు సూచించారు.
అధునాత సేవలు సమర్థవంతంగా అందిస్తున్నందుకు ఎంఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందిని మంత్రి అభినందించారు. మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నిరుపేద ప్రజలకు అనుకూలంగా వైద్య సేవలు అందించాలని సంబంధిత హాస్పిటల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డితోపాటు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, ఎంఎన్ జె డైరెక్టర్ డాక్టర్ జయలత, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.